మోహన్ బాబు…. సెలబ్రెటీ అనదగ్గ లెజెండ్
లెజెండ్ అనిపిలుచుకోదగ్గ సెలబ్రెటీ..!
ఎందుకొచ్చిన గొడవ లెండి… ఆయనకు కోపం వస్తే, ‘సిల్లీఫెలోస్’ అని ప్రేమగా తిడతారు. కలక్షన్ కింగ్ అనేస్తే పోలా..?!
ఏమాటకామాట చెప్పుకోవాలి. డైలాగులు చెప్పడంలో ఆయన తరవాతే ఎవరైనా. ఆ డైలాగ్‌లో స్పష్టత ఉంటుంది. నాటకీయత ఉంటుంది. ఓ గ్లామర్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. చాలా తక్కువ మందికే అబ్బిన విద్య అది. ‘అన్నగారు తరవాత డైలాగ్ చెప్పడంలో నేనే’ అనుకోవడంలో తప్పేం లేదు. అది ఆయన టాలెంట్.
నటుడిగా మోహన్ బాబు చూసిన ఎత్తుపల్లాలు అన్నీ ఇన్నీ కావు. మోహన్ బాబు ఇక అయిపోయాడు అనుకొన్నప్పుడు – ఓ హిట్ తిసి, మళ్లీ నిలబడడం, మోహన్ బాబుకి ఇక తిరుగులేదు అని రిలాక్సయినప్పుడు వరుస ఫ్లాపులతో డీలా పడడం – ఆయన కెరీర్‌కి అలవాటే.
రిస్క్ తీసుకోవడం మోహన్ బాబుకి వెన్నతో పెట్టిన విద్య. ‘ఇదే ఆఖరి రూపాయి’ అనుకొన్నప్పుడు కూడా, ఆ రూపాయిని సినిమాపైనే పెట్టి, కోట్లు సంపాదించిన ఘనత మోహన్‌బాబుది. అందుకే ఇన్నేళ్లు నిలబడగలిగారు. నటుడిగా 500 పైచిలుకు సినిమాలు చేసి, నిర్మాతగా 80కి పైగా చిత్రాల్ని అందించిన అరుదైన ఘనత మోహన్ బాబుకి సొంతం.
అల్లరి మొగుడు, అల్లుడు గారు, మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం.. ఇలా చెప్పుకొంటూ పోతే, ఎన్నో బ్లాక్ బస్టర్లు. పెదరాయుడు గురించి అయితే ఇహ చెప్పాల్సిన పనిలేదు. అదో చరిత్ర. ఓ చిన్న నటుడిగా ప్రయాణం మొదలెట్టి, క్యారెక్టర్ వేషాలు వేసి, విలన్ గా భయపెట్టి, ఆ తరవాత హీరోగా ఎదిగి, నిర్మాతగా మారి – యాభై ఏళ్ల పాటు పరిశ్రమలో కొనసాగడం మామూలు విషయం కాదు.
అన్నింటికి మించి క్రమ శిక్షణ అంటే మోహన్ బాబు గురించి చెప్పుకొంటారు. 7 గంటలకు షూటింగ్ అంటే ఆయన ఐదు నిమిషాలు ముందే ఉంటారు. రూపాయి తక్కువ ఇచ్చినా, ఆయన బ్యానర్లో పారితోషికాలు నిక్కచ్చిగా వస్తాయన్న పేరుంది. మీడియా పట్ల కూడా ఆయన ఇలానే వ్యవహరిస్తారు. ప్రెస్ మీట్ 10 గంటలకు అంటే 12 గంటలకు ప్రారంభం అయితే గొప్ప. కానీ మోహన్ బాబుతో వ్యవహారం అలా ఉండదు. పదంటే.. పదే. సమయపాలనకు ఇంత కంటే పెద్ద ఉదాహరణ ఎక్కడ ఉంటుంది.
అయితే కొన్ని విషయాల్లో ఆ క్రమ శిక్షణ ఈమధ్య కాస్త పట్టు సడలినట్టు అనిపిస్తోంది. చేతికి అందిన కొడుకులు ఇద్దరూ ఇప్పుడు గొడవలు పడుతూ వీధికెక్కారు. పరిశ్రమకు ‘పెదరాయుడు’గా ఉంటూ.. ఇంట్లో జరుగుతున్న పంచాయితీలకు తీర్పు చెప్పలేకపోతున్నారు. మీడియా పట్ల మోహన్‌బాబు దురుసుగా ప్రవర్తించిన తీరు.. ఆయన పెద్దరికానికీ, క్రమశిక్షణకు మచ్చ తెచ్చేదే.
ఎవరి జీవితంలో అయినా ఇలాంటివి మామూలే. కుటుంబం అన్నాక గొడవలు ఉండవా, పంచాయితీలు పెట్టుకోరా, మళ్లీ కలిసిపోరా..? నిజమే.. మోహన్ బాబు కుటుంబం కూడా అలా కలిసి పోవాలన్నది అందరి కోరిక. అది తీరాలంటే, తన కుటుంబ సమస్యని తానే పెదరాయుడులా పరిష్కరించుకోవాలి. ‘మోహన్ బాబు అంటే క్రమశిక్షణ, క్రమ శిక్షణ అంటే మోహన్ బాబు’ అనుకొనేలా మళ్లీ ఆయన ప్రవర్తించాలి.
నటుడిగానూ ఎందుకో మోహన్ బాబులో ఇది వరకటి స్పీడు లేదు. ఇప్పటికీ ఆయన ప్రేక్షకుల్ని మెప్పించగలరు. ‘బుజ్జిగాడు’లో ఆయన వేసిన వేషం గుర్తుంది కదా? ‘యమదొంగ’లో ఆయన రాజసం మర్చిపోలేం కదా? అలాంటి పాత్రలు మళ్లీ చేయాలి. మళ్లీ తన డైలాగ్ డెలివరీలోని పదును చూపించాలి. అందుకోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తనయుడు మంచు విష్ణు కలల సినిమా ‘కన్నప్ప’కు మోహన్ బాబు నిర్మాత. ఇందులో ఆయన నటుడిగానూ మెరుస్తున్నారు. ఈ సినిమాతో మోహన్ బాబు సంస్థకూ, నటుడిగా ఆయనకూ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. దాంతో పాటుగా ఇంటి గొడవలు సర్దుమణిగితే చాలు. మంచు కుటుంబానికి మంచి రోజులు వచ్చినట్టే.
ఎనీవే.. హ్యాపీ బర్త్ డే… కలక్షన్ కింగ్.