మంచు ఫ్యామిలీ మొత్తం ఫ్లాపులతో సతమతమవుతోంది. మనోజ్ – విష్ణులకు వరుసగా ఫ్లాపులు తగులుతున్నాయి. మంచు లక్ష్మి కూడా హిట్ చూసి చాలాకాలమైంది. తాజాగా మోహన్బాబుకూ ఓ గట్టి దెబ్బ తగిలింది.. గాయత్రి రూపంలో. ఈ సినిమాపై దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపితే కోటి రూపాయలు కూడా రాలేదు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ చవి చూసిన అతి పెద్ద ఫ్లాపుల్లో గాయత్రి కూడా ఒకటి. దేనికీ భయపడి మోహన్ బాబు సైతం.. ఈ ఫ్లాపుకి కలవరపడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ”ఇక మీదట నిర్మాణ రంగానికి వీలైనంత దూరంగా ఉండాల”ని మోహన్ బాబు నిర్ణయించుకున్నట్టు.. ఇదే విషయం తనయులకూ చెప్పినట్టు సమాచారం. అయితే ఇందులో మరో పాజిటీవ్ కోణం కూడా ఉంది. ‘గాయత్రి’లో మోహన్ బాబు పోషించిన ‘గాయత్రి పటేల్’ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అలాంటి పాత్రలు వస్తే… బయట నిర్మాణ సంస్థల్లో సైతం పని చేయాలని, ఆ విధంగానైనా… తనని ఇష్టపడే అభిమాన వర్గానికి దగ్గరగా ఉండాలని మోహన్ బాబు భావిస్తున్నార్ట. ఇప్పటి వరకూ మోహన్ బాబుకు బయటి నిర్మాణ సంస్థ లనుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ… వాటిని ఎప్పటికప్పుడు పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఇక మీదట తనకు నచ్చిన పాత్రల్ని వదలకుండా చేయాలని మోహన్‌బాబు భావిస్తున్నారు. సో.. నిర్మాతగా కాకపోయినా, నటుడిగానైనా మోహన్ బాబు టచ్‌లో ఉంటారన్నమాట.