మోహన్ బాబు సినీ ప్రస్థానం విలన్ పాత్రలతోనే మొదలైంది. ఆ తరవాత ఆయన హీరో అయ్యారు. ఆయన ఖాతాలో కొన్ని మధురమైన విజయాలు ఉన్నాయి. అయితే మోహన్ బాబు మళ్లీ విలన్ గా కనిపిస్తే చూడాలన్నది ఆయన అభిమానుల ఆశ. మోహన్ బాబు లాంటి నటులు విలన్ గా మారితే గనుక… సినిమాలు, కథలు కొత్త పుంతలు తొక్కుతాయని బలంగా నమ్మేవాళ్లూ ఉన్నారు. ఇది వరకు కూడా మోహన్ బాబుకు విలన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఒప్పుకోలేదు. ‘బుజ్జిగాడు’ లో నటించినా అది సెమీ విలన్ పాత్రలాంటిదే. అయితే ఎట్టకేలకు `పారడైజ్` సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకొన్నారు. నాని లాంటి ఈ జనరేషన్ హీరో సినిమాలో మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు విలన్ గా చేయడం.. నిజంగా సర్ప్రైజింగ్ విషయమే.
ఈ సినిమాలో మోహన్ బాబు లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకొంటోంది. హీరో పాత్రకు ధీటుగానే మోహన్ బాబు పాత్రనీ తీర్చిదిద్దినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసినిమా కోసం ఆయనకు రూ.5 కోట్ల పారితోషికం ఇచ్చార్ట. ఆయన లుక్, స్టైలింగ్ కోసం కూడా భారీగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు ఇంటి సెట్ కి సైతం కోట్లలో ఖర్చయ్యిందని టాక్. మోహన్ బాబు లాంటి నటుడ్ని తీసుకొచ్చారంటే ఈమాత్రం ఖర్చులు భరించాల్సిందే. మార్చిలో రావాల్సిన సినిమా ఇది. అయితే ఇప్పుడు వాయిదా పడింది. జూన్ లేదా జులైలో తీసుకొచ్చే అవకాశం ఉంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
