పెరుగుతున్న బడ్జెట్స్ దృష్ట్యా వేరే భాషల్లో కూడా మార్కెట్‌ని పెంచుకోవాలని మన స్టార్ హీరోస్ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న అన్ని సినీ పరిశ్రమలతోనూ పోల్చుకుంటే పరాయి భాషల నటులు, టెక్నీషియన్స్, సినిమాలను తెలుగు వారు ఆదరించినట్టుగా ఇంకెవ్వరూ రిసీవ్ చేసుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమావాళ్ళది కూడా ప్రతిభను ప్రోత్సహించే తత్వమే. అయితే పరభాషా హీరోలు, అక్కడ పాపులర్ అయిన నటులతో కలిసి నటించి మార్కెట్‌ని పెంచుకోవాలనుకుంటున్న మన స్టార్ హీరోలకు మాత్రం ఎక్కువ సార్లు నిరాశే ఎదురవుతోంది. తెలుగు హీరోలు చిరంజీవి, మోహన్‌బాబులు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి సినిమాల్లో నటించారు. మోహన్‌బాబు అయితే రజినీకాంత్ తెలుగు డబ్బింగ్ సినిమాలకు చాలా సహాయం చేశాడు. రజినీకాంత్‌కి తెలుగులో కూడా సూపర్ స్టార్ ఢం వచ్చింది. కానీ మోహన్‌బాబు మాత్రం తమిళ్లో చిన్న హీరో కూడా కాలేకపోయారు. కొన్ని మోహన్‌బాబు సినిమాల కథలు తమిళ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి కూడా. అయినప్పటికీ మోహన్‌బాబుకి కలిసొచ్చిందేమీ లేదు. అలాగే చిరంజీవి కూడా రజినీ, కమల్ హాసన్‌లాంటి వాళ్ళతో కలిసి నటించినప్పటికీ ఎందుకో తమిళ్లో మాత్రం కనీస స్థాయి మార్కెట్ కూడా క్రియేట్ అవ్వలేదు.
చరిత్ర విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ లాంటి హీరోలు మలయాళంలో మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉండడంతో….. జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కూడా ఓ ప్రయత్నం చేశాడు. భారీగా రెమ్యూనరేషన్ సమర్పించుకుని మోహన్లాల్కి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ని ఆఫర్ చేశారు. అలాగే ఆయన ఒకె అన్న తర్వాత కూడా ఆ క్యారెక్టర్ని ఇంకాస్త డెవలప్ చేశారు. ఇంచుమించుగా మల్టీస్టారర్ సినిమా లుక్ వచ్చేలా చేశారు. తెలుగు మీడియాలో మోహన్లాల్కి భారీ పబ్లిసిటీ ఇప్పించారు. ఎన్టీఆర్‌లాంటి టాప్ రేంజ్ స్టార్ నటుడు కూడా మోహన్‌లాల్‌ని చాలా గొప్పగా ప్రశంసించాడు. జనతా గ్యారేజ్ సినిమా తెచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు మలయాళంలో హిట్ అయిన మోహన్‌లాల్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మనవాళ్ళు కూడా ఆయన సినిమాల డబ్బింగ్ రైట్స్ కొనడానికి క్యూ కట్టేస్తున్నారు.
మరి ఎన్టీఆర్‌కి మలయాళంలో మార్కెట్ క్రియేట్ అవడం కోసం మోహన్‌లాల్ ఏమైనా చేశాడా అంటే మాత్రం… ఏమీలేదనే చెప్పాలి. జనతా గ్యారేజ్ మలయాళం రైట్స్‌ని కూడా తనే సొంతం చేసుకున్న మోహన్‌లాల్….జనతా పబ్లిసిటీ కోసం ఆడియో రిలీజ్ ప్రోగ్రాం కాదు కదా, కనీసం క్రూ అందరితో, ఎన్టీఆర్‌తో కలిసి ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. నచ్చిన రేటుకు భారీగా అమ్మేసుకున్న మోహన్‌లాల్…. అదే రేంజ్లో ఎక్కువ థియేటర్స్‌లో సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్‌కి మోహన్‌లాల్ చేసింది ఏమీ లేదు. ఎన్టీఆర్ వళ్ళ లాభపడింది మాత్రం చాలా ఎక్కువ. మోహన్‌లాల్ నటనను, ఆయన మంచితనాన్ని తక్కువ చేసే ఉద్ధేశ్యం లేదు కానీ ఇప్పుడు మోహన్‌లాల్ మలయాళం సినిమాలు… తెలుగులో రిలీజ్‌కి రెడీ అవుతూ ఉంటే మాత్రం ఎన్టీఆర్ వలన లాభపడిన మోహన్‌లాల్ అదే ఎన్టీఆర్‌ని మోసం చేశాడా అని అయితే అనిపిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో దశాబ్ధాలుగా అసోసియేట్ అయి ఉన్న జర్నలిస్ట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.