మోక్ష‌జ్ఞ ఎంట్రీ… ఇంకాస్త ఆల‌స్యం

2019లోనే మోక్ష‌జ్ఞ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇస్తాడ‌ని… యేడాది క్రిత‌మే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌తోనే మోక్ష‌జ్ఞ‌ని తెర‌పై చూసుకునే ఛాన్స్ దొరుకుతుంద‌ని ఆశించారంతా. కానీ.. బ‌యోపిక్‌లో మోక్ష‌జ్ఞ‌కు ఛాన్స్ రాలేదు. మోక్ష‌జ్ఞ ఎంట్రీ విష‌యంలో త‌న‌కు ఏమాత్రం తొంద‌ర‌లేద‌ని, అందుకే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో త‌న‌కో పాత్ర ఇవ్వాల‌న్న ఆలోచ‌న రాలేద‌ని బాల‌య్య క్లారిటీగా చెబుతున్నాడు.

అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ కూడా ఆల‌స్యమ‌వ్వ‌బోతోంద‌ని స‌మాచారం. 2019లో మోక్షు సినిమా ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. దానికి కార‌ణం… మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం అడుగుతున్నాడ‌ట‌. మోక్షు ఇప్పుడు కాస్త బొద్దుగా ఉన్నాడు. ముందు ఒళ్లు త‌గ్గాలి. ఆ త‌ర‌వాత‌… సినిమాకి సంబంధించిన కీల‌క విభాగాల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకుని, దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్న‌ద్ధం అవ్వాలి. దానికి తోడు.. ఎన్టీఆర్ – మ‌హా నాయ‌కుడు విడుద‌ల అయ్యాక‌.. బాల‌య్య ఎన్నిక‌ల హ‌డావుడిలో ప‌డిపోతారు. ఎన్నిక‌ల సీజ‌న్ ముగిసిన త‌ర‌వాత గానీ.. మోక్షు క‌థ‌ల కోసం అన్వేష‌ణ మొద‌ల‌వ్వ‌దు. త‌న‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టాలా? లేదంటే కొత్త ద‌ర్శకుడితో ప్ర‌య‌త్నించాలా అనే విష‌యంలోనూ బాల‌య్య ఇంకా క్లారిటీ గా లేడు. బోయ‌పాటి, క్రిష్‌లాంటి ద‌ర్శ‌కుల‌తో బాల‌య్య‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ బోయ‌పాటి మాత్రం `మోక్షుతో సినిమా అప్పుడే కాదు.. ఒక‌ట్రెండు సినిమాల త‌ర‌వాత అయితే ఓకే` అంటున్నాడు. క్రిష్ దృష్టి బిగ్ లీగ్‌పై ఉంది. స్టార్ హీరోతో త‌న త‌దుప‌రి సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు. సో.. వీరిద్ద‌రూ ఇప్పుడు అందుబాటులో లేన‌ట్టే. ముందు క‌థ‌లు సిద్దం చేసి, ఆ త‌ర‌వాత అందుకు త‌గిన ద‌ర్శ‌కుడిని ఎంచుకోవాల‌న్న‌ది మ‌రో ఆలోచ‌న‌. సో… నంద‌మూరి వార‌సుడిని తెర‌పై చూసుకోవాలంటే ఇంకొన్నాళ్లు నిరీక్షించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com