బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటివరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో అత్యంత చెత్త సీజన్ గా ప్రేక్షకుల చేత పరిగణించబడుతోంది. దీనికి – కంటెస్టెంట్ సెలక్షన్ తీరు దగ్గర నుండి వార వారం ఎలిమినేషన్ జరుగుతున్న తీరు వరకు పలు కారణాలు ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా, కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేయడంలో బిగ్ బాస్ చూపిస్తున్న పక్షపాత ధోరణి మీద సోషల్ మీడియాలో పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ వారం ఈ సెటైర్ల డోసు మరింతగా పెరిగినట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
పులిహోర సీజన్ అంటూ విమర్శలు:
ఈ సీజన్ ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. సీరియస్ గా గేమ్ ఆడుతూ అందరితో మంచిగా ప్రవర్తించే అభ్యర్థులను ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ బయటకు పంపించి, హౌస్ లో ఎవరో ఒకరితో రొమాంటిక్ థ్రెడ్ రన్ చేయగల అభ్యర్థులను మాత్రం ఓటింగ్ తో నిమిత్తం లేకుండా ఈ సీజన్లో బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుతున్నారని పలు విమర్శలు ఉన్నాయి. సగానికి పైగా మంది ఎలిమినేట్ అయిన తర్వాత మిగిలిన సూపర్ సెవెన్ అభ్యర్థులు అందరూ బ్యాచిలర్స్ కావడం ఈ సీజన్ పులిహోర సీజన్ అనడానికి ఒక ప్రధాన నిదర్శనం.
ఈ సీజన్ ప్రారంభం నుండి అభిజిత్ అఖిల్ లతో మోనాల్ ని లింక్ చేస్తూ బిగ్బాస్ నిర్వాహకులు నడిపిన థ్రెడ్ పట్ల ప్రేక్షకుల్లో ఎంత వెగటు పుట్టిందో సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తే అర్థం అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఫుటేజ్ కోసం సీరియస్ గా ఆడే అభ్యర్థులను వారం వారం గేమ్ నుంచి బిగ్ బాస్ పంపించడం పట్ల ప్రేక్షకుల్లో వ్యక్తమైన వ్యతిరేకత కారణంగానే ఈ సీజన్ కి పులిహోర సీజన్ అన్న బిరుదు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
మోనాల్ పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత :/span>
షో ప్రారంభమైన మొదటి రోజే అవసరం లేకపోయినా జల జల కన్నీళ్లు కారుస్తూ ఏడ్చి ప్రేక్షకుల్లో వ్యతిరేకత సంపాదించుకుంది మోనాల్. ఇక ఆ తర్వాత ఇటు అభిజిత్ అటు అఖిల్ తో మోనాల్ ఆడిన డబుల్ గేమ్ ప్రేక్షకులకు చిర్రెత్తు కొచ్చేలా చేసింది. వాళ్ల కోపాన్ని వాళ్ళు పలుమార్లు ఓట్ల రూపంలో చూపించారు. అయినప్పటికీ పలు పోర్టల్స్లో తన కంటే రెండు రెట్లు ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న మరొక స్ట్రాంగ్ హౌస్ మేట్ ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి, తనను ఓట్లతో నిమిత్తంలేకుండా కొనసాగిస్తూ రావడం వల్ల ప్రేక్షకులలో తన పట్ల మరింత వ్యతిరేకత పెరిగింది.
అదే సమయంలో, ఎవరైనా నామినేషన్ చేసేటప్పుడు తను చేసిన పొరపాట్లు ఎత్తి చూపిస్తే ఇది నేషనల్ ఛానల్, అలాంటి నేషనల్ ఛానల్ లో ఒక ఆడపిల్ల పట్ల ఇలా మాట్లాడితే ఎలా అంటూ తీవ్రంగా విరుచుకు పడే మోనాల్ , అదే షో లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత అఖిల్ ను ముద్దులుపెట్టుకుంటూ, హగ్ చేసుకునే సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు మరి ఇప్పుడు ఇది నేషనల్ ఛానల్ కాదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
ఈ రోజు కూడా సేవ్ అయిన మోనాల్:
అయితే ఈ వారం , మునుపటి వారాల తో పోలిస్తే తనపై మరింత వ్యతిరేకత వచ్చింది. అవినాష్ ని ఒక టాస్క్ లో భాగంగా కాలితో తన్నింది అన్న ఆరోపణలు దానికి సంబంధించిన ఫుటేజ్, ప్రత్యేకించి ఆ తర్వాత ఆమె నవ్వుతూ చూసిన తీరు, ప్రేక్షకులలో మరింత వ్యతిరేకత తీసుకొచ్చింది. ఓటింగ్ ప్రకారమే అయితే ఎప్పుడో షో నుండి వెళ్ళిపో వలసిన మోనాల్, కనీసం ఈ వారం వెళ్ళిపోతుందని ఇప్పటికీ షో ని ఫాలో అవుతున్న ప్రేక్షకుల భావించారు ( ఈ సీజన్ మరీ చెత్తగా ఉండడంతో చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే సీజన్ చూడడం మానేశారు). అయితే ఈ వారం అవినాష్ ని ఎలిమినేట్ చేసి, మోనాల్ ని బిగ్ బాస్ సేవ్ చేయడంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఓట్లు పట్టించుకోము, మోనాల్ నీ పంపించం దిక్కున్నచోట చెప్పుకోండి :
మిగతా వాళ్ళ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి లో ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చే అంచనాలు దాదాపుగా నిజం అవుతాయి. మోనాల్ ఓట్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రం, ఆ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంచనాలు విశ్లేషకుల ఊహకు కూడా అందడం లేదు. దాదాపు పలు సోషల్ మీడియా పోర్టల్స్తో పాటు, ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంచనాలు వేసినా, ఆఖరి నిమిషంలో బిగ్ బాస్ నిర్వాహకులు మనసు మార్చుకున్నారని, దీంతో ఎలిమినేట్ కావడం లేదని ఆయా పత్రికలు సవరణ, వివరణ ఇస్తున్నాయి.
దీంతో ప్రేక్షకులలో, మోనాల్ ని ప్రేక్షకుల ఓట్ల తో నిమిత్తం లేకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్రతివారం కాపాడుతూ ఉన్నారని అభిప్రాయం బలంగా ఏర్పడింది. అసలు ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారో, బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదంటూ అత్తారింటికి దారేది సినిమా స్టైల్ లో మీమ్స్ తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆమె విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓట్లను పట్టించుకోకుండా ప్రేక్షకులను బకరాలు చేస్తున్నారని అంటూ పలువురు ఇప్పటికే ఓటు వేయడం, షో ని సీరియస్ గా ఫాలో కావడం మానేశారు. బిగ్ బాస్ నిర్వాహకుల తీరు- మోనాల్ ని పంపించం, ప్రేక్షకులనుండి వచ్చిన ఓట్లను పట్టించుకోము, మీ దిక్కున్నచోట చెప్పుకోండి అన్నట్లుగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం ఇంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్నప్పటికీ, బిగ్ బాస్ నిర్వాహకులు ఎందుకు మోనాల్ ని కాపాడుతున్నారో అర్థం కాక పోయినప్పటికీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మాత్రం ఇప్పటిదాకా వచ్చిన తెలుగు బిగ్ బాస్ లలో అత్యంత చెత్త సీజన్ గా మారడం లో బిగ్ బాస్ నిర్వాహకుల దే ప్రధాన పాత్ర అన్నది మాత్రం ప్రేక్షకుల కి అర్థమైంది.