కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. దాన్ని పరిశీలించి ప్రధానమైన అంశాలతో సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ సోమవారం తెలంగాణ కేబినెట్ కు రిపోర్టు సమర్పిస్తుంది. దాన్ని బట్టి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రతి అవకతవకకు కారణం కేసీఆరేనని రిపోర్టు వచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన అలా అన్నా అనకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే నిర్మాణం జరిగిందని అందరికీ తెలుసు. స్వయంగా అసెంబ్లీలో రీడిజైనింగ్ తానే చేశానని ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్లు, టెండర్లు అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగి ఉంటాయని చెప్పాల్సిన పని లేదు. నివేదికలో భిన్నంగా వచ్చే అవకాశం లేదు. అయితే కేసీఆర్ నిబంధనలు ఎక్కడైనా ఉల్లంఘించారా అన్నదే కీలకం.
కేబినెట్ లో చర్చించుకుండా నిర్ణయాలు తీసుకోకుండా.. ప్రాజెక్టును ప్రారంభించారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే కేబినెట్ నిర్ణయాలపై ఇప్పటి ప్రభుత్వం పూర్తి సమాచారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు ఇచ్చింది. అంటే మొత్తం ప్రాజెక్టు ఆలోచన నుంచి.. రీడిజైనింగ్, కాంట్రాక్టర్ల ఎంపిక వరకూ అన్ని విషయాలనూ జస్టిస్ పీసీ ఘోష్ పరిశీలించి నివేదిక రెడీ చేశారు. కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేల్చితే.. తదుపరి కేబినెట్ ఏ చర్యలు తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే చత్తీస్ఘడ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నియమించిన కమిటీ రిపోర్టు ప్రభుత్వం వద్ద ఉంది. ఆ కమిటీ రిపోర్టుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ సోమవారం కేబినెట్ లో ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది బీఆర్ఎస్ లోనూ ఉత్కంఠగా మారింది.