తుపాను మొంథా ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. మూడు రోజుల నుంచి ప్రజల్ని భయపెడుతూ వస్తున్న తుపాను.. ఈ రాత్రికి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తుపాన్ దగ్గరకు వచ్చే కొద్దీ వర్షం, గాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. విశాఖ నుంచి తిరుపతి వరకూ భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరి,కృష్ణ,గుంటూరు జిల్లాలకు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
భారీ వర్షాలు, గాలుల కారణంగా ఇప్పటికే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చాలా చోట్ల కరెంట్ నిలిపివేశారు. కనీసం ఓ లక్ష మందిని శిబిరాలకు తరలించారు. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తుపాన్ తీవ్రత ఎలా ఉంటున్నదానిపై నష్టం ఆధారపడి ఉంటుంది. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు పాడుబడిన ఇళ్ల నుంచి మనుషుల్ని ఖాళీ చేయించారు. వృద్ధులు, వితంతువుల్ని ప్రత్యేకంగా షెల్టర్లకు తరలించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్. ఆర్టీజీఎస్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.తుపాన్ వేగం .. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. అందరూ కొన్ని ప్రత్యేకమైన విభాగాలను ఎంచుకుని మానిటరింగ్ చేస్తున్నారు. ఈ రాత్రికీ తీరం దాటిన తర్వాత తుపాను .. ఒడిషా వైపు వెళ్లిపోతుంది. రేపు ఉదయం వరకూ గండం ఉంటుందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలందర్నీ అప్రమత్తం చేస్తూ. నిద్రపోకుండా ప్రభుత్వ వర్గాలు మానిటర్ చేయనున్నాయి.