హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. కొత్త ఇళ్ల కన్నా.. పాత ఇళ్ల కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 51 శాతం చేతులు మారుతున్న పాపర్టీలేనని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది కొత్తగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయడం లేదు. పాత ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
సాధారణంగా ఎవరైనా ఇళ్లు కొనుగోలు చేసేందుకు మొదటగా కొత్త ఇళ్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూంటారు. రీసేల్ ఇళ్లు ఎక్కువగానే కొంటారు కానీ.. మరీ అదే మార్కెట్ లీడర్ అన్నట్లుగా మారిపోవడం అరుదే. అయితే హైదరాబాద్ మార్కెట్ లో ఈ ట్రెండ్ కు కారణం ధరలే అని అంచనా వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనేందుకు కొంత మంది సిద్దం చేసుకునే సరికి .. ఇళ్ల రేట్లు రెట్టింపు అవుతున్నాయి.దాంతో వారు పాత ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు.
అపార్టుమెంట్లలో సాధారణంగా పదేళ్లకుపైబడిన అపార్టుమెంట్ల విలువ తగ్గుతుంది. పెద్దగా పెరగదు. కానీ ఇప్పుడు పదేళ్ల కిందట అపార్టుమెంట్లు కట్టిన ప్రాంతాలు బిజీగా మారిపోయాయి. అక్కడ ఇప్పుడు కొత్త అపార్టుమెంట్ తో పోలిస్తే సగం రేటులోనే పాత అపార్టుమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది పాత అపార్టుమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు.