గీతం సంస్థకు వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారంటూ వైసీపీ నేత అధినేత జగన్, ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై ఆ సంస్థ బాధ్యతలు చూస్తున్న ఎంపీ భరత్ స్పందించారు. జగన్ చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు.
ఎంపీ భరత్ స్పందన ఇదీ
కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు అనుబంధ మీడియా సంస్థలు గీతం సంస్థపై, నాపై పనిగట్టుకుని అసత్యాలను, విషాన్ని చిమ్ముతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి వాస్తవ విరుద్ధమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం విచారకరం. వైఎస్సార్సీపీ నుంచి నేను ఎలాంటి సాయాన్ని ఆశించడం లేదు కానీ, 2020 దసరా సెలవుల్లో అర్ధరాత్రి వేళ మా ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేసినప్పుడైనా విశ్వవిద్యాలయం పట్ల కనీస అవగాహనతో వ్యవహరిస్తారని ఆశించాను.
జగన్ చేసిన ఆరోపణ: గీతంకు కేటాయించనున్న 54.79 ఎకరాల విలువ రూ.5,000 కోట్లు
భరత్ సమాధానం: గీతం రుషికొండ క్యాంపస్‌ను ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు కింద మధ్యతరగతి గృహాల కోసం 35 ఎకరాలు కేటాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దీనిని రెసిడెన్షియల్ నుండి మిక్స్డ్ యూజ్ కిందకు మార్చారు. ఆ తర్వాత దీనిని చిన్న చిన్న ప్లాట్లుగా 1000 నుండి 3000 గజాలు విభజించి వేలం వేశారు. మే 2024 వరకు జరిగిన వేలంలో గజం ధర రూ.60,000 నుండి రూ.65,000 మధ్య ఉంది. ఈ లెక్కన ఎకరానికి సుమారు రూ. 19.5 కోట్లు అవుతుంది. అంటే మొత్తం 54.79 ఎకరాల విలువ సుమారు రూ1,000 కోట్లు ఉంటుంది. ఒకవేళ మీరు భూమి ధర 5 రెట్లు పెరిగి రూ. 5,000 కోట్లకు చేరిందని అంటే.. అది ఈ ఎన్డీయే ప్రభుత్వ పాలనలో విశాఖ అభివృద్ధికి మీరు ఇస్తున్న అతిపెద్ద సర్టిఫికేట్ అవుతుంది. మీ వైఖరి ఏంటో మీరే తేల్చుకోండి.
జగన్ రూ. కోటికి పదకొండు ఎకరాలు ఇచ్చిన కాలేజీ ఏమయింది?
ఇక ఇదే విశాఖలో గీతం క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలోనే ఉన్న ఒక TSIB అనే అంతర్జాతీయ పాఠశాలకు 2023లో మీ ప్రభుత్వమే 11 ఎకరాల భూమిని ఎకరానికి కేవలం రూ. ఒక కోటి చొప్పున ఇచ్చింది. భూమి విలువ ఎకరానికి రూ. 100 కోట్లు ఉంటే, మరి ఆ సంస్థకు అంత తక్కువ ధరకు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఐటీ ఉద్యోగుల పిల్లలకు ఉపయోగపడుతుందని నేను ఆ నిర్ణయాన్ని స్వాగతించాను కానీ, మూడేళ్లు గడిచినా అక్కడ కనీసం పునాది రాయి కూడా పడలేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? మీ లెక్కల ప్రకారం రూ.1,100 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 11 కోట్లకు ఎందుకు ధారాదత్తం చేశారు?
ఆరోపణ 2: భూములను ఇప్పుడు ఉచితంగా కట్టబెడుతున్నారు
భరత్ సమాధానం: జీవీఎంసీ జారీ చేసిన ఎన్ఓసీ భూమి ధరను నిర్ణయించదg. భూమి కేటాయింపు, దాని ధరపై నిర్ణయం తీసుకోవాల్సింది సీసీఎల్ఏ ., కేబినెట్ మాత్రమే. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించడానికి తాము సిద్ధమని గీతం గత 20 ఏళ్లుగా చెబుతూనే ఉంది. మేము ఏదీ ఉచితంగా అడగడం లేదు. ఈ విషయం మీకు తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్నందున నాపై, నాతో సంబంధం ఉన్న సంస్థలపై నిఘా ఉంటుందని నాకు తెలుసు. మీకు సాయం చేయడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు కానీ, సమాజానికి సేవలందిస్తున్న సంస్థలపై ఇలా విషం చిమ్మకండి. కరోనా సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వమే గీతం ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించి 3000 మందికి పైగా రోగులను మాకు అప్పగించింది.