మంత్రి `పెద్దమ్మ’కు కష్టాలు తప్పవా?

మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న (ఆదివారంనాడు) కారెక్కబోతుండగా అడ్డమొచ్చి డబ్బులడిగిన పేదబాలుడ్ని కాలితో తన్నిన సీనియర్ మంత్రి కుసుమ్ మెహ్దెలె రాజకీయ సుడిగుండంలో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారంరోజుల్లోగా ఆమె తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని అక్కడి ప్రతిపక్షం కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతోంది. 62ఏళ్ల ఈ `పెద్దమ్మ’ కథలెన్ని చెబుతున్నా విపక్షాలకు అవి ఏమాత్రం నచ్చడంలేదు. కాగా, మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.

పన్నా వద్ద ఒక కార్యక్రమానికి హాజరై ఈ పెద్దమ్మ తిరిగివెళుతుండగా కారుఎక్కేటప్పుడు 12ఏళ్ల కుర్రాడు అడ్డుపడి, ఆమె కాళ్లపైబడి డబ్బులిమ్మంటూ వేడుకోవడం, ఆమె కసురుకుంటూ బూటికాలితో ఈ కుర్రాడ్ని తన్నడం గత రెండురోజులుగా హాట్ టాపిక్ గామారిపోయింది. ఈ సంఘటనను వీడియోతీసి యూట్యూబ్ లో పెట్టడంతో అది వైరల్ గా స్ప్రెడ్ అయింది. దీంతో కాంగ్రెస్. ఆమ్ఆద్మీపార్టీలు మండిపడుతున్నాయి. అయితే, మంత్రి పెద్దమ్మ మాత్రం ఆ పిల్లాడు తప్పతాగి తూలిపడ్డాడనీ, వెంటనే తాను తప్పించుకుని కారెక్కి వెళ్ళిపోయానని చెబుతున్నారు. పిల్లాడు తాగినట్లు తన ముక్కులు పసిగట్టాయని కూడా అంటున్నారు.

సంఘటన జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఎవరో అధికారులు గుర్తించారు. బ్రిజ్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బీదల కాలనీలో ఈ కుర్రాడు ఉంటాడని తెలిసింది. ఈ కుర్రాడు అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడట. ఇవన్నీ ఆనోటాఈనోటా విన్న కబుర్లేనని అధికారులే చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం ఈ కుర్రాడి గురించిన సమాచారం కొంత అందించారు. ఈ అబ్బాయి వాళ్ల తండ్రి ట్రైబల్ అనీ, అతను రోజువారీ కూలీ అని చెబుతున్నారు. పిల్లాడు చదువుసంధ్యలేకుండా తిరుగుతుంటాడని చెబుతున్నారు. అయితే, పిల్లాడికి డ్రగ్స్, లేదా మందుకొట్టే అలవాటు మాత్రం లేదనే అంటున్నారు. మంత్రి చెప్పిన మాటలకు స్థానికులు చెబుతున్న వివరాలకు ఎక్కడా పొంతన చిక్కడంలేదు.

కానీ, మన ఘనమైన మంత్రిగారికి (పెద్దమ్మకి) మాత్రం పిల్లాడు తప్పతాగి పడిపోయినట్లే అనిపించింది. పైగా ముక్కులదిరే వాసన వచ్చేసిందట. అందుకే తప్పించుకోవడానికి కాలితో పక్కకి త్రోసేసి కారెక్కిపోయారట. సరే, నిజమేదో నిలకడమీదనే తేలుతుంది. ఒకవేళ తనమాటలే తప్పని తేలితే, అప్పుడీ పెద్దమ్మ స్పందన ఎలాఉంటుందో … పిల్లాడు మాత్రం తాను డబ్బులు అడగబోతుంటే ఆమె కాలితో తన్నారనే అంటున్నాడు.

సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలకు విందుభోజనం దొరికినట్లే. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో అదే జరుగుతోంది. పిల్లల పట్ల ప్రేమచూపించాల్సిందిపోయి, కాలితో తన్నిన మంత్రి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ పట్టుబడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వంకానీ, అటు కేంద్రంలోని ప్రభుత్వంకానీ విమర్శలకు స్పందించే లక్షణం లేదనీ, దీంతో ఆమె వెంటనే రాజీనామా చేస్తారని తాము భావించడంలేదని, ఇదో విచిత్ర పరిస్థితని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయినప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. కాగా, బాలలపై వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అభియోగాలపై పెద్దమ్మపై కేసులు నమోదవుతున్నాయి. వారంరోజుల్లో ఆమె తన పదవికి రాజీనామాచేయకపోతే సీఎంని కూడా తప్పుపట్టాల్సివస్తుందని అంటున్నారు కాంగ్రెస్ యువనాయకులు.

మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరసన తెలుపుతోంది. మంత్రిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆప్ రాష్ట్ర ప్రతినిధులు మానవ హక్కుల కమిషన్ కు వినతిపత్రం అందజేశారు.

మొత్తానికి సీనియర్ మంత్రి పెద్దమ్మకు కష్టాలు ప్రారంభమయ్యాయనే అనిపిస్తోంది. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలుసుకుని తన గోడు వెల్లబోసుకున్నారు. చిన్నసంఘటనే అనుకున్నది కాస్తా ఇప్పుడు గుదిబండగా మారి ఆమెకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఒక బాలుడి కారణంగా ఆమె తన పదవిని కోల్పోతుందా…? లేక సీఎం శ్రీకృష్ణ పరమాత్మలా ఆదుకుంటారా ? ఏమో.. వేచి చూడాల్సిందే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com