సుజ‌నా చౌద‌రికి ఎంపీ ప‌ద‌వి టీడీపీ నుంచి వ‌చ్చింది కాద‌ట‌..!

పార్టీ మారుతున్న‌ప్పుడు ప‌ద‌వి వ‌దిలి వెళ్ల‌డం అనే సంస్కృతే ఇప్పుడు లేదు! ఆ మాట‌కొస్తే… ప‌ద‌వి వ‌దిలేసి వ‌స్తామ‌నే నాయ‌కుల్ని చేర్చుకోవ‌డానికి పార్టీలు కూడా సిద్ధంగా లేవ‌నే చెప్పాలి. న‌లుగురు టీడీపీ ఎంపీల‌ను భాజ‌పా చేర్చుకున్న‌దే రాజ్య‌స‌భ‌లో సంఖ్యాబ‌లం కోసం. అయితే, సుజ‌నా చౌద‌రి టీడీపీ నుంచి ఇప్పుడు చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. భాజ‌పాలోకి వెళ్లేముందు టీడీపీ నుంచి వ‌చ్చిన ప‌ద‌విని వ‌దిలేసి వెళ్తే కొంతైనా హుందాగా ఉండేది. ఇదే మాట ఆయ‌న ముందు ప్ర‌స్థావిస్తే… త‌న‌కు వ‌చ్చిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం టీడీపీని వ‌చ్చింది ఎలా అవుతుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ఉల్టా ప్ర‌శ్నించారు..!

త‌న‌కు వ‌చ్చిన రాజ్య‌స‌భ స‌భ్యుడి ప‌ద‌వి పార్టీ నుంచి వ‌చ్చింది కాద‌న్నారు సుజ‌నా చౌద‌రి!! అప్ప‌టి ఎమ్మెల్యేలు త‌న‌ని ఎన్నుకున్నార‌న్నారు. ఇది నామినేటెడ్ పోస్ట్ కాద‌న్నారు. త‌న‌ను ఎన్నుకున్న శాస‌న స‌భ్యులు తెలుగుదేశం పార్టీవారే కాబ‌ట్టి… వారికి ధ‌న్య‌వాదానాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పేశాన‌న్నారు. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి ఏది ఉప‌యోగ‌మో అదే చేస్తాన‌న్నారు. ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా తాను పార్టీ మారేవాడిన‌న్నారు. ఎన్నిక‌ల ముందే మార‌దామ‌ని అనుకున్నాన‌నీ, కానీ ఒక పెద్దాయ‌న కొన్నాళ్లు ఆగ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌న్నారు. నారా లోకేష్ టీడీపీలో క్రియాశీలం కావ‌డంతో చంద్ర‌బాబు నాయుడుతో తాను విభేదించ‌డం మొద‌లుపెట్టాన‌న్న విమ‌ర్శ స‌రైంది కాద‌న్నారు. ఎన్డీయేలో కొన‌సాగాల‌న్న అంశంపై మాత్ర‌మే తాను చంద్ర‌బాబుతో బ‌లంగా చెప్పేవాడిన‌ని అన్నారు. అయితే, నారా లోకేష్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్ల్ ఎత్తుర‌నీ, ఇచ్చిన క‌మిట్మెంట్స్ ని స‌రిగా చేయ‌డం లేద‌నీ, సీరియ‌స్నెస్ లేక‌పోతే పార్టీ విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తింటుందనీ… ఇలాంటి విష‌యాలు తాను చాలా చెప్పాన‌న్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తూ… ఆ నాయ‌కుల స్థాయి పెర‌గాల‌ని సూచించారు!

రాజ్య‌స‌భ‌గా త‌న‌ని ఎన్నుకున్న స‌భ్యుల‌కు థ్యాంక్స్ చెప్పేస్తే.. ఆ పార్టీకీ ప‌ద‌వికీ సంబంధం ఉండ‌ద‌న్న‌మాట‌! నామినెటెడ్ ప‌ద‌వి మాత్ర‌మే పార్టీ నుంచి వ‌చ్చిన‌ట్టా..? ఇదేం లాజిక్కు..? ఇప్పుడు భాజ‌పాలోకి వెళ్లినంత మాత్రాన‌… టెక్నిక‌ల్ గా ఆయ‌న టీడీపీ స‌భ్యుడే క‌దా. ఈయ‌న మా ఎంపీ అని భాజ‌పా కూడా సాంకేతికంగా చెప్ప‌లేదు క‌దా! భాజ‌పాలో కొత్త‌గా వ‌చ్చిన ప‌ద‌వి అంటూ ఏదీ లేదు క‌దా. ప‌ద‌విలో ఉంటేనే భాజ‌పా తీసుకుంటుంది. కాబ‌ట్టి, రాజీనామా చేసి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఆ మాట సూటిగా చెప్ప‌కుండా… ఇది పార్టీ ఇచ్చిన ప‌ద‌వి ఎలా అవుతుంద‌ని సుజ‌నా వ్యాఖ్యానించ‌డం, మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డానికి ఇంకో కార‌ణ‌మౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com