Mrithyunjaya Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
థ్రిల్లర్ సినిమాల్లోని మజా ఏమిటో ఓటీటీలు వచ్చాకే తెలిసింది. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్లు గట్టి ప్రభావం చూపించాయి. ట్విస్టులు, టర్న్‌లు కలిపిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. సింగిల్ థ్రెడ్ కథల్ని ఎంత ఆసక్తిగా మలచవచ్చో నిరూపించాయి. తెలుగులోనూ అడపా దడపా థ్రిల్లర్లు వస్తున్నాయంటే.. వాటి వెనుక మలయాళ చిత్రాల స్ఫూర్తి ఉంది. ‘మృత్యుంజయ్’ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. చిన్న పాయింట్ తో సినిమాని ఇంత ఈజీగా నడిపించొచ్చా? అనిపించింది. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్’ అనిపించుకొన్న శ్రీవిష్ణు..ఈసారి థ్రిల్లర్‌తో ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంది? ‘మృత్యుంజయ్’లోని ఆ మిస్టరీ.. ఏమిటి?
జై (శ్రీవిష్ణు) ఓ దిన పత్రికలోని యాడ్స్ విభాగంలో పని చేస్తుంటాడు. కంపెనీకి యాడ్స్ తీసుకురావడం అతని పని. అవి కూడా అలాంటిలాంటి యాడ్స్ కాదు. అంత్యక్రియలకు సంబంధించినవి. ఎక్కడ ఎవరు చనిపోయినా.. వాలిపోతాడు. వాళ్ల బంధువుల్ని, స్నేహితుల్ని ఒప్పించి యాడ్స్ తీసుకొస్తుంటాడు. కాకపోతే ఆ పనిని చాలా తెలివిగా చేస్తుంటాడు. అందుకోసం రకరకాల వేషాలు వేస్తుంటాడు. తన దృష్టి మాత్రం.. క్రైమ్ రిపోర్టింగ్ పై ఉంటుంది. ఎలాగైనా క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని కలలుకంటుంటాడు. ఓసారి రెండు మరణాలు అతనిలో కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. రెండు మరణాలూ ఒకేలా ఉండడం, పోలీసులు వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తుండడం అనుమానాస్పదనంగా అనిపిస్తుంది. దానికి తోడు ఓ పాప తన తండ్రి ఎందుకు చనిపోయాడు? అనే ప్రశ్న సంధిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా తనకు తానై ఓ ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. మరి ఆ ప్రయాణంలో తాను తెలుసుకొన్న నిజాలేంటి? ఆ రెండు మరణాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనేది తెరపై చూడాలి.
ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. ఆయన సుకుమార్ శిష్యుడు. సుకుమార్ విజయాల్లో తన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఈ సినిమాపై ఇంకాస్త ఫోకస్ పెరిగింది. రెగ్యులర్ కమర్షియల్ పేట్రన్‌లో కాకుండా ఓ థ్రిల్లర్ ని చెప్పాలనుకొన్న ప్రయత్నం అభినందించదగినది. సింగిల్ ఎజెండాతో సాగే సినిమా ఇది. ఓ కిల్లర్‌ని పట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే సినిమా. సినిమా మొత్తం ఇదే లైన్లో సాగుతుంది. ఎక్కడా సైడ్ ట్రాక్ పట్టలేదు. డ్యూయెట్లు, ఐటెమ్ సాంగులు, లవ్ ట్రాకుల జోలికి అస్సలు పోలేదు. ఏ ఫ్రేములో చూసినా కథే కనిపిస్తుంటుంది. హీరో నేపథ్యం కూడా కొత్తగా అనిపిస్తుంది. అంత్యక్రియలకు సంబంధించిన ప్రకటనలు తీసుకురావడానికి అతను చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ మోటీవ్ ఉంటుంది. అయితే… అంత పెద్ద పెద్ద దిన పత్రికలు మరీ అంత్యక్రియల యాడ్లపై అంత ఫోకస్ చేయడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది.
రెండు మరణాలు, వాటికి సంబంధించిన క్లూలు వెదికి పట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు అంత పకడ్బందీగా లేవు. ఓ బిచ్చగాడి ద్వారా చాలా ఈజీగా క్లూలు సంపాదించడం కన్వెన్సింగ్ రైటింగ్ లా అనిపిస్తుంది. అయితే ఆ క్లూస్ తో హీరో కిల్లర్ ని అన్వేషించడం ఆసక్తి పెంచింది. ఇంట్రవెల్ బ్యాంగ్ బాగా తీశారు. హీరో – కిల్లర్ దాగుడు మూతలాట థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. హీరో తన వృత్తినే (శ్రద్దాంజలి యాడ్స్)ని వాడుకొని, విలన్ని పట్టుకోవాలని చూడడం మంచి ఐడియా. క్లైమాక్స్ లో హీరో – విలన్లు ఎదురెదురు పడి, డైలాగులతో కాలక్షేపం చేయడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కానీ విలన్ ని అంతం చేయడానికి హీరో వాడిన ట్రిక్ మళ్లీ మెప్పిస్తుంది. అక్కడక్కడ ‘ధృవ’ ఛాయలు కనిపిస్తాయి. అయితే సినిమా మొత్తం చూశాక.. ‘పసివాడి ప్రాణం’ సినిమాని మరో వెర్షన్లో తీశారా? అని కూడా అనిపిస్తుంది. కనిపించని హంతకుడి కోసం హీరో చేసే అన్వేషణ ఈ రెండు కథల్లోని కామన్ పాయింట్.
శ్రీవిష్ణు చాలా సెటిల్డ్ గా చేశాడు. తన మార్క్ కామెడీ ఈ సినిమాలో లేదు. కాకపోతే ఇంటెన్సిటీ కనిపించింది. తన లుక్ కూడా మారింది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. తనది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. విలన్ గా చేసిన ఆర్యన్ లుక్ బాగుంది. ఆ హైట్, శరీర ధారుడ్యం సరిగ్గా సరిపోయాయి. అయితే ఈ పాత్రకు ఓ తెలుగు హీరోని ఎంచుకొంటే ఇంకా బాగుండేది. హీరో – విలన్ ల మధ్య హైడ్ అండ్ సి ఆట మరింత రక్తి కట్టేది. సుదర్శన్, రచ్చరవి పాత్రల్ని కూడా వీలైనంత భిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
కాలభైరవ నేపథ్య సంగీతం, తన థీమ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. హీరో, విలన్ క్యారెక్టరైజేషన్లని ప్రతిబింబిస్తూ లైటింగ్ సెట్ చేశారు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. రెండుగంటల్లో సినిమా అయిపోయింది. థ్రిల్లర్ చిత్రాలకు ఇలాంటి రన్ టైమ్ అవసరం. ఫ్రేమింగ్ ని డీ కోడ్ చేస్తే కానీ ఆ విషయం అర్థం కాదు. దర్శకుడు మలయాళం ఫ్లేవర్ లో ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని చూపించాలనుకొన్నాడు. కాకపోతే సుకుమార్ శిష్యుడు అనేసరికి ఇంకొన్ని తెలివితేటలు, మైండ్ గేమ్ మూమెంట్స్ ఆశిస్తారు. అవి తగ్గాయి. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాల్ని చూసేవాళ్లకు ‘మృత్యుంజయ్’ నచ్చుతాడు. కానీ ఒక్కటే కండీషన్… మరీ ఎక్కువ ఆశించి వెళ్లకూడదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ థీమ్స్ ఉండవు. కాకపోతే.. రెండుగంటల పాటు ఎక్కడా బోర్ కొట్టదు. ఆ మాత్రం గ్యారెంటీ ఉంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
