ఈ ఐపీఎల్ ఛాంపియన్ ఎవరు అనేదానికంటే, ధోనీ చెన్నై తరపున మళ్లీ బరిలోకి దిగేదెప్పుడు? అనే గట్టిగా చర్చింరుకొంటన్నారు అభిమానులు. ఐపీఎల్ లో ధోనీ ఇంపాక్ట్ అలాంటిది. చైన్నై మ్యాచ్ ఉన్న ప్రతీసారీ ‘ధోనీ ఆడతాడా, లేదా’ అనే ఆత్రుత ఫ్యాన్స్ లో ఎక్కువైపోతోంది. ‘ఈసారి తలా వస్తాడు..’ అని గంపెడాశలతో అభిమానులు స్టేడియంకి వెళ్లడం, ధోనీ రాకపోవడం.. ఈ తంతు కంటిన్యూ అవుతూనే ఉంది. గత మ్యాచ్‌లోనే ధోనీ వస్తాడని ప్రచారం జరిగింది. కానీ ధోనీ రాలేదు. ఆదివారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడడం ఖాయం అనుకొన్నారు. కానీ.. ఈసారీ నిరాశ తప్పలేదు.
అసలు ధోనీ ఆడతాడా, ఆడడా? అని అడిగితే యాజమాన్యం కూడా స్పష్టంగా చెప్పలేకపోతోంది. తాజాగా ధోనీ ప్రాక్టీస్ సెషన్లో మరోసారి గాయపడినట్టు టీమ్ స్పష్టం చేసింది. గతంలో పిక్క దగ్గర కండరాలు పట్టేయడంతో… ధోనీ ఆటకు దూరం అయ్యాడు. ఆ దెబ్బ నుంచి కోలుకొని, ఉపశమనం పొంది, మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాడు ధోనీ. కానీ మళ్లీ అదే గాయం తిరగతోడింది. దాంతో ధోనీ ఇంకొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాల్సివస్తోందని చెన్నై యాజమాన్యం స్పష్టం చేసింది. ధోనీ లేకుండానే ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడింది చెన్నై. అందులో మూడు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ధోనీ రాగానే చెన్నై ఆట తీరు మారిపోతుందని, పాయింట్ల పట్టికలో దూసుకుపోతుందని కాదు. కానీ ధోనీ వస్తే అదో ధైర్యం. వేల రూపాయలు పెట్టి, స్టేడియంకి వస్తున్న ఫ్యాన్స్‌కు అదో తృప్తి.
ధోనీ లేకుండా చెన్నై టీమ్ ని ఊహించుకోవడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారేమో అనిపిస్తోంది. 2027లో ధోనీ పసుపు జెర్సీలో కనిపించడం దాదాపు అసాధ్యం. తనకు ఇదే చివరి సీజన్ కావొచ్చు. కాబట్టి.. తనకు కూడా బరిలోకి దిగాలని ఉంటుంది. ఆ అవకాశం కోసమే ధోనీ ఎదురు చూస్తున్నాడు. కానీ పరిస్థితులే అనుకూలించడం లేదు.
