ఆమ్ ఆద్మీ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అవినీతికి వ్యతిరేకంగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉద్భవించిన ఈ పార్టీ, నేడు తన ఉనికిని కాపాడుకోవడమే సవాల్‌గా మారిన స్థితికి చేరుకుంది. ఢిల్లీ పీఠంపై తిరుగులేని పట్టు సాధించిన అరవింద్ కేజ్రీవాల్, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో తీవ్రంగా దెబ్బతిన్నారు. 70 స్థానాలకు గాను కేవలం 22 స్థానాలకే పరిమితం కావడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకోవడం ఆప్ పతనానికి నాందిగా కనిపిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వస్తామన్న పార్టీ, చివరకు అదే రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయిందన్న భావన ఓటర్లలో బలంగా నాటుకుపోవడం ఆప్ ఆశలపై నీళ్లు చల్లింది.
పంజాబ్‌లో భారీ కుదుపు – చేజారుతున్న అధికారం?
ఢిల్లీలో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పంజాబ్‌లో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఏడుగురు ఎంపీలలో ఆరుగురు బీజేపీ గూటికి చేరడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఉదంతం. 2/3 వంతు సభ్యులు పార్టీని వీడటంతో అనర్హత వేటు నుంచి తప్పించుకుని, వారు బీజేపీలో విలీనం కావడం కేజ్రీవాల్‌కు కోలుకోలేని దెబ్బ. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదులు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ , ప్రజాప్రతినిధులు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనవుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా మూడింట రెండు వంతుల మంది పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.
కేజ్రీవాల్ సామాన్యుడ ఇమేజ్ – మసకబారుతున్న చరిష్మా
ఒకప్పుడు సామాన్యుడి గొంతుకగా, వ్యవస్థను ప్రక్షాళన చేసే బాహుబలి గా కేజ్రీవాల్‌ను ప్రజలు ఆరాధించారు. కానీ, వరుసగా ఎదురవుతున్న అవినీతి ఆరోపణలు, శీష్ మహల్ వంటి లగ్జరీ ఇష్యూలు ఆయన ఇమేజ్ను తీవ్రంగా ద్యామేజ్ చేశాయి. ఆదర్శ రాజకీయాల నుంచి అధికారం కోసమే తాపత్రయపడే సంప్రదాయ రాజకీయ నాయకుడి ముద్ర ఆయనపై పడిపోయింది. పంజాబ్‌లో జరిగిన భారీ వలసలు ఆయన నాయకత్వంపై నమ్మకాన్ని సడలించాయి. బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేసి మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవడానికి ఆయన వద్ద ఇప్పుడు కనీస అస్త్రాలు కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది.
సంక్షోభంలో జాతీయ హోదా
నేడు ఆప్ ఉనికి కేవలం పంజాబ్ ప్రభుత్వానికే పరిమితమైంది. అక్కడ కూడా నియోజకవర్గ స్థాయి నేతలు భారీగా బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటంతో, రాబోయే రోజుల్లో ఆప్ మరో ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఢిల్లీలో ఓటమి, పంజాబ్‌లో అంతర్గత తిరుగుబాటు.. ఇవన్నీ చూస్తుంటే ఆప్ మళ్ళీ ప్రజల నమ్మకాన్ని పొందాలంటే అద్భుతమే జరగాలి.
కేజ్రీవాల్ పై క్రేజ్ తగ్గినట్లే !
ఏ పార్టీకైనా దాని సిద్ధాంతాలే పునాదులు. ఆప్ తన మూల సూత్రాలను వదిలేసి సంప్రదాయ రాజకీయాలు చేయడం తీయడం వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకవైపు బీజేపీ పక్కా వ్యూహంతో ఆప్ కోటలను బద్ధలు కొడుతుంటే, మరోవైపు కేజ్రీవాల్ ఆత్మరక్షణలో పడిపోయారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆప్ మళ్ళీ సామాన్యుడి బాహుబలి గా అవతరించడం అంటే అది అగ్ని పరీక్షే అనుకోవచ్చు.


