క్రైమ్ : మిర్యాలగూడలో పట్టపగలు హత్య.! కూతురి జీవితంపై పగ బట్టడమేనా పరువు నిలుపుకోవడం..!!

పిల్లాపాపలతో కూతురు సుఖంగా ఉండటం .. ఏ తండ్రికయినా…. పరువు తక్కువ అవుతుందా..?. మనసుకు నచ్చిన వాడ్ని చేసుకుని హాయిగా జీవిస్తూంటే.. ఆ తండ్రికి పరువు పోయినట్లవుతుందా..?. రక్తం పంచుకుని బిడ్డ పసుపు, కుంకమలు తీసేస్తే.. ఆ తండ్రి పోగొట్టుకున్న పరువు వెనక్కి వస్తుందా..?. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ తండ్రి తన కూతురి విషయంలో వ్యవహరించిన విధానం చూస్తే.. ఈ అనుమానాలు అందరికీ వస్తాయి. ఆ తండ్రి తన కూతుర్ని కూతురిగా చూడలేదు. ఆమెను పరువుగా చూశాడు. ఆమె మనసుకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకుంటే.. ఓర్చుకోలేకపోయాడు. తన కూతుర్ని .. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా కాకుండా.. పరువుగా చూశాడు. ఆ పరువు మెడలో.. తక్కువ కులం వ్యక్తి తాళి కట్టాడని… విచక్షణ మరిచాడు. కూతురి జీవితంలో నిప్పులు పోశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది.

మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ నుంచి ప్రణయ్ అనే యువకుడు.. భార్యతో నడుచుకుంటూ వెళ్తూండగా.. వేటకత్తితో కాచుకుని కూర్చున్న వ్యక్తి నరికేశాడు. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కారణం.. ఆ యువకుడు.. ఇతర కులంలోని అమ్మాయిని ప్రేమించడం. .. పెళ్లి చేసుకోవడం. కులంలోనే కాదు.. ఆస్తిలోనూ ఉన్నతమైన కుటుంబం అమ్మాయి ప్రేమను పొందడమే.. అతని జీవితాన్ని అంతం చేసింది. డబ్బులతో పాటు కులంలోనూ అధికులమనుకున్న… అమ్మాయి తండ్రి కిరాయి హంతకుల్ని పెట్టి.. ప్రణయ్‌ను చపించేశాడు.

ప్రణయ్, అమృతను ఈ ఏడాది జనవరి 31న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసు కున్నాడు. అమృత తండ్రి మొదటి నుంచి వీరి ప్రేమను వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించి.. వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ మారుతీరావు మాత్రం.. తన బిడ్డను ఇంటికి తెచ్చుకోవాలనే ప్రయత్నించారు. పెద్దలతో పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అమృత… ప్రేమించిన వాడితోనే నిలబడింది. అతనితోనే జీవితం అని తేల్చి చెప్పింది. ఇది తమకు పరువు తక్కువ అని భావించిన మారుతీరావు… అల్లుడ్ని హత్య చేయించి.. తన పరువు నిలబెట్టుకుందామనుకున్నారు. కిరాయి హంతకులతో హత్య చేయించారు. ప్రస్తుతం అమృత గర్భవతి. వైద్య పరీక్షల ప్రణయ్, అమృతలు ఆస్పత్రికి వచ్చిన సమయం చూసి.. హంతకుడు మటన్‌ షాపులో వినియోగించే కత్తితో ప్రణయ్‌ మెడపై నరికాడు. వెంటనే మరొక వేటు వేయడంతో ప్రణయ్‌ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు.

గర్భవతిగా ఉన్న కూతురి పసుపు కుంకుమలు తీసేసిన మారుతీరావు పరువు.. ఇప్పుడు తిరిగి వచ్చిందా..?. ఇంత కాలం తాను తెచ్చి తెచ్చి పెట్టుకున్న పేరు ప్రఖ్యాతులు ఒక్క వేటుతో పోగొట్టుకున్న మారుతీరావుకు.. జీవితాంతం.. సంఘంలో గౌరవమర్యాదలు దక్కుతాయా..?. కులం .. కులం అంటూ.. కూతురి కన్నా… ఎక్కువగా పరువునే భావించిన వ్యక్తికి ఇక జీవితం అంటూ ఉంటుందా..?. ఇప్పుడు అతన్ని సమాజం చూసే చూపు తో పరువు నిలబడుతుందా..? పోతుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.