రాజకీయ పార్టీలలో కూడా కుల చిచ్చు రగిలిందా?

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అధికార తెదేపాతో సహా వివిధ రాజకీయ పార్టీలలోని కాపు, బీసీ నేతల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడుతున్నాయి. తెదేపాలో 26మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఐదుగురు మంత్రులుగా ఉన్నారు. అలాగే మిగిలిన వారిలో బీసీలు, ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులున్నారు. వారి మధ్య కూడా ఇప్పుడు ఈ కులచిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. కానీ అధికార పార్టీలో ఉన్నారు కనుక ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి మౌనం వహిస్తున్నారు.

తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొని ఉంది. వారిలో కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుంటే, ఏపి బీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, అధికార ప్రతినిధి పాక సత్యనారాయణ తదితరులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో వివిధ పార్టీలలో రెండు వర్గాలకు చెందిన నేతలకు ఎవరి వాదనలు వారికున్నాయి. ఎవరూ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అంటే దానర్ధం వారందరికీ తమతమ కులాల ప్రజల మీద అభిమానం కారిపోతోందని కాదు…ఈ విషయంలో వెనక్కి తగ్గితే తమ కులాల ప్రజలు తమను వ్యతిరేకిస్తారనే భయం చేతనేవారు వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదని చెప్పవచ్చును.

ఈ రెండు వర్గాల ప్రజలు, నేతలు వాదోపవాదాలు ఎలాగ ఉన్నప్పటికీ, కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం దంపతులు మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకి చేరుకొంది. వారి బీపి షుగర్ లెవెల్స్ క్రమంగా తగ్గిపోతున్నాయి. కనుక వారి మద్దతుదారులలో ఆందోళన కూడా పెరుగుతోంది. ఈ విషయంలో ఆయన దీక్షకు కూర్చొనక మునుపే ప్రభుత్వం తన నిర్ణయం చాలా స్పష్టంగా చెప్పి కొంత గడువు కోరింది. కానీ అది ఆయనకు అంగీకరించకపోవడంతో దీక్షకు కూర్చొన్నారు.

ఆయన దీక్షకు కూర్చోన్నప్పటి నుండి ప్రతీ రెండు మూడు గంటలకొకసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తూ సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. వారి ఆరోగ్యం పరిస్థితిని బట్టి త్వరలోనే పోలీసులు రంగప్రవేశం వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును. అయితే అంతటితో ఈ సమస్య పరిష్కారం అవుతుందా అంటే కాదనే అందరికీ తెలుసు. కాపులకు, బీసీలకు ఆమోదయోగ్యంగా పరిష్కారం కావాలంటే జస్టిస్ మంజూనాద్ కమీషన్ నివేదిక వచ్చే వరకు అందరూ ఆగక తప్పదు. ఆ నివేదిక రావడానికి కనీసం ఆరు నుండి తొమ్మిది నెలలు పట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి అంతవరకు కాపు నేతలు ముఖ్యంగా ప్రతిపక్షాలలో ఉన్న నేతలు ఆగుతారా..లేదా? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com