పరిషత్ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి తాజా షెడ్యూల్ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించనున్నారు.
ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ దిశగా అడుగులు వేస్తోంది. పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో, వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి చేయనున్నరాు.
చట్టబద్ధంగా ప్రక్రియ
ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్పులు చేర్పులు పూర్తయిన తర్వాత, నిర్దేశించిన గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు.
పాత బీసీ రిజర్వేషన్లే
బీసీ రిజర్వేషన్లను పెంచినవి అమలు చేయడం సాధ్యం కావడం లేదు కాబట్టి కేసీఆర్ హయాంలో జారీ చేసిన జీవో ఆధారంగానే రిజర్వేషన్లు ఇస్తారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, ఈ షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటరు నమోదు, చిరునామాల మార్పులపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఓటర్ జాబితాలను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
