మంత్రి పదవి కోసం తహతహలాడిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణను శాసించే రోజు మునుగోడు గడ్డ నుంచే వస్తుందని, స్థానిక ప్రజల ఆశీర్వాదంతో తాను రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ఆయన ప్రకటించారు. అబ్బో అని చాలా మంది అనుకున్నారు కానీ.. రాజగోపాల్ రెడ్డి మాటల వెనుక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందన్న అనుమానాలు కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పదవి కోసం బెదిరింపులా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం చెబుతున్నప్పటికీ, ఆయన మాత్రం తన పట్టు వీడడం లేదు. ఇప్పుడు “=శాసిస్తా” అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రి పదవి ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటాననే పరోక్ష హెచ్చరికలని పార్టీలోని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు.
కొంత మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారా?
రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడంతో, ఆయన చుట్టూ కొంతమంది ఎమ్మెల్యేలతో కూడిన ఒక ప్రత్యేక వర్గం ఏర్పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని, ప్రభుత్వ నిర్ణయాలపై అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల పక్షాన పోరాడుతామని చెప్పడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని బలహీనం చేసేందుకు రెడీ అయ్యారా?
కాంగ్రెస్ పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు మాత్రం రాజగోపాల్ రెడ్డిని నాన్-సీరియస్ పొలిటీషియన్ గా కొట్టిపారేస్తున్నాయి. ఆయనకు పదవి ఇస్తే అంతా బాగుందని అంటారని, లేకపోతే ఇలాగే అసంతృప్తి వెళ్లగక్కుతారని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన ఎన్ని ప్లాన్లు వేసినా, సోదరుడు వెంకట్ రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఇప్పట్లో అసాధ్యమని గాంధీ భవన్ వర్గాల్లో గట్టి నమ్మకం ఉంది. మంత్రి పదవి వచ్చే వరకూ రాజగోపాల్ రెడ్డి తన మునుగోడు మార్క్ రాజకీయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారని స్పష్టమవుతోంది.
