మూసి నది బఫర్ జోన్ లో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ వాసులకు సీఎం రేవంత్ ఫైనల్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. ఆ అపార్ట్మెంట్ ఎప్పటికీ బఫర్ జోన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి, భవిష్యత్తులో ఆ ఆస్తికి మార్కెట్ విలువ ఉండదు. రిజిస్ట్రేషన్లు కానీ, అమ్మకాలు కానీ సాగవు కాబట్టి ఆస్తి విలువ సున్నాకు చేరుకుంటుంది. ఒక్క రూపాయి కూడా వాల్యూ ఉండని చోట ఉండటం కంటే, వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళ్లడం మేలు అనే సంకేతాన్ని ఆయన పరోక్షంగా పంపారు.
ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారం.. అపార్ట్మెంట్ ఓనర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే, నిబంధనల ప్రకారం వారికి పరిహారం అందుతుంది. తద్వారా వారు ఆ నష్టాన్ని కొంతమేర పూడ్చుకుని వేరే చోట స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అక్కడే ఉంటామంటే ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించదు, కానీ ఆ ఆస్తిపై ఉన్న చట్టబద్ధత , విలువను మాత్రం కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి అపార్ట్మెంట్ ఓనర్ల కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఎటువంటి బలప్రయోగం చేయకుండానే, ఆర్థిక పరమైన , చట్టపరమైన చిక్కులను వివరిస్తూ వారికి ఒక గౌరవప్రదమైన మార్గాన్ని చూపింది.
ఆ అపార్టుమెంట్ మూసి గాంధీ సరోవర్ ప్రాజెక్టు తలపెట్టినప్పటి నుండి వివాదంలో ఉంది. మూసిని ఆక్రమించినట్లుగా ఉండే ఆ ఆపార్టుమెంట్ లో 450 కుటుంబాల వరకూ ఉంటున్నాయి. వారిలో కొంత మంది తాము ఖాళీ చేయబోమని ప్రభుత్వ పరిహారం వద్దని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వకపోతే.. ఇక ఎప్పటికీ ఆ అపార్టుమెంట్ అమ్మకాలు కొనుగోళ్లు జరగవు. ప్రభుత్వం చేపట్టే పనుల వల్ల బఫర్ జోన్ లో ఉండటం వల్ల.. ముంపు కూడా ఉండే అవకాశం ఉంది. అన్నీ ఆలోచించుకుని అపార్టుమెంట్ వాసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


