హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్ట్, నగర రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త బూమ్‌కు కారణం అవుతోంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నమూనాను అధ్యయనం చేసిన అనంతరం, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేయడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయ్ి.
ఈ ప్రాజెక్టు వల్ల మూసీ నది వెంబడి ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు 15 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, బాపుఘాట్, నాగోల్ , ఉప్పల్ పరిసరాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. దుబాయ్‌కు చెందిన ఏఎంఆర్ ప్రాపర్టీస్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.
ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ ప్రాజెక్ట్ తొలి దశ కోసం రూ.4,100 కోట్ల రుణాన్ని మంజూరు చేయడంతో పనులు వేగవంతం కానున్నాయి. మార్చి నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవునా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ పాత్‌లు, రివర్ క్రాసింగ్ బ్రిడ్జిలు , గాంధీ సరోవర్ వంటి పర్యాటక ఆకర్షణలు నిర్మించనున్నారు.
