విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విజయవాడలోని ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారిపై రుబాబు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆయన .. జీవీఎంసీ కార్యాలయం దగ్గర 24 అంతస్తుల అపార్టుమెంట్ కు ప్లాన్ చేశారు. అనుమతులు కావాలని దరఖాస్తులు చేశారు. అలాంటివి లోకల్ లో ఇవ్వడం లేదని.. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) దగ్గరే తీసుకోవాలన్నారు. అయితే చాలా రూల్స్ అతిక్రమించారని చెప్పి అనుమతులు ఇవ్వలేదు.
దాంతో నేరుగా ఆయన మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) కార్యాలయానికి వచ్చారు. అపార్ట్మెంట్కు అనుమతులు ఇవ్వనందుకు ఆగ్రహించిన మహిళా అధికారి అయిన విద్యుల్లతను దుర్భాషలాడారు. ‘నీ అంతు చూస్తా, పర్సనల్ కేసులు పెట్టి కోర్టుకు లాగుతా, రూ.50 లక్షల లంచం ఇచ్చామని చెబుతానని బెదిరించారు. ఆయనతో వచ్చిన మనుషులు కూడా అదే పని చేశారు. ఇది జరిగి వారం పైనే అవుతోంది.
ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ నిర్మాణ స్థలం చర్చికి చెందినది మరియు కోర్టు వివాదంలో ఉన్నందున డీటీసీపీ అనుమతులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఎంవీవీ తాను ఇక విశాఖలో వ్యాపారాలు చేయనని .. గతంలో తన భార్యను, కుమారుడ్ని కిడ్నాప్ చేసినప్పుడు చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఇంకా అవే పనులు చేస్తూ .. అధికారుల మీద రుబాబు చేస్తున్నారు.