తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే కొన్ని సంస్థలే ముందు గుర్తుకు వస్తాయి. మైహోం, రాజపుష్ప, ఫీనిక్స్ ఇలా కొన్ని సంస్థలు గుత్తాధిపత్యంలా ఉంటాయి. ఇతర సంస్థలు కూడా ఉంటాయి. కానీ వాటిలోనూ బడా కంపెనీలకే పరోక్షంగా పెత్తనం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ వేలం పాట జరిగినా ఈ సంస్థలు రికార్డు స్థాయిలో ధరలు పెట్టి భూములు కొనుగోలు చేసేవి. అవి కాక పోతే అనుబంధ సంస్థలు కొనేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న వేలాల్లో ఆ సంస్థల జాడ కనిపించడం లేదు.
కోకాపేట తాజా వేలంలో వినిపించని మోహోం, రాజపుష్ప పేర్లు
కోకాపేటలో ఇటీవల రెండు ప్లాట్లను వేలం వేశారు. ఒకటి వజ్ర కన్ స్ట్రక్షన్స్ అనేసంస్థ దక్కించుకుంది. మరొకటి ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకుంది. ఈ వజ్ర అనే సంస్థ బిగ్ లీగ్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటి సారి. ఎంఎస్ఎన్ రియాల్టీ గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ భూములు దక్కించుకుని ఓ లగ్డరీ ప్రాజెక్టు ప్రారంభించింది. ఫార్మా రంగంలో మంచి పేరు ఉన్న ఎంఎస్ఎన్ సంస్థ అనుబంధ కంపెనీ ఎంఎస్ఎన్ రియాల్టీ. ఈ సంస్థ యజమాని బీఆర్ఎస్ తరపున ఎంపీగా చేశారు కానీ.. ఇప్పుడు పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ భూములు మాత్రం సంస్థ తరపున కొంటున్నారు. వేలంలో మైహోం, రాజపుష్ప సంస్థలు పోటీ పడినట్లుగా కనిపించలేదు.
గత వేలాల్లో భూములన్నీ ఈ కంపెనీలవే
గతంలో కోకాపేట నియోపొలీస్ లో వేలం వేసినప్పుడు రాజపుష్ప, మైహోం గ్రూపు కంపెనీలు రికార్డు స్థాయిలో వంద కోట్లుకు ఎకరం కొనుగోలు చేశాయి. ఇప్పుడు రూ. 130 కోట్లు పెట్టడం ఆ సంస్థలకు పెద్ద విషయం కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్పన్పుడే వీరు భూములు వేలంలో దక్కించుకోవడం కాస్త విచిత్రమే. ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత లగ్జరీ , ఖరీదైన ప్రాజెక్టుగా చెప్పుకునే మైహోంభూజా ఉన్న ప్రాంతం కూడా బీఆర్ఎస్ హయాంలో.. మైహోం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిందే. ఆ సంస్థ బడా ప్రాజెక్టులన్నీ ఎక్కువగా ఇలా బీఆర్ఎస్ హయాంలో వేలంలో పాడుకున్నవే. వాటన్నింటిలోనూ అత్యంత లగ్జరీ అపార్టుమెంట్లు కడుతూనే ఉన్నారు. మరి ఇంతటితో ఆపేస్తారా.. లేకపోతే ఇప్పటికే ఉన్న స్థలాల్లో కట్టుకుంటే చాలనుకుంటున్నారా?
రాజపుష్పది మరో విచిత్రమైన కథ
రాజపుష్ప సంస్థ మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కుటుంబానిది. ఆయన కలెక్టర్ గా ఉంటే ఆయన కుటుంబం ఈ రాజపుష్పను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. అంతా వెంకట్రామిరెడ్డి దయేనని అందరికీ తెలుసు. అధికారిగా ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితంగా ఉంటారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితమయ్యారు. సిద్దిపేట కలెక్టర్ గా ఉండేవారు. ఎంత దగ్గర అంటే..ఆయనతో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ చేశారు. తర్వాత మెదక్ ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఆయన కంపెనీ రాజపుష్ప బడా ప్రాజెక్టుల్ని చేపట్టింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోయే సరికి కొనడం ఆపేసింది. అనుకూల ప్రభుత్వాలు లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా.. ముందూ..వెనుకా చూసుకుంటాయోమో ?