గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఆ కేసు చుట్టూ అల్లుకున్న మిస్టరీ మాత్రం వీడటం లేదు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చినా, అసలు సిసలు పెద్దల పాత్ర , వేల కోట్ల ఆస్తుల లెక్కల విషయంలో మాత్రం ప్రజల్లో అనుమానాలు అలాగే ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్ కౌంటర్ చేసిన దాదాపు పదేళ్లకు ఈడీ 10 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం కేసులో ఒక పురోగతిగా కనిపిస్తున్నా, అది కేవలం మంచుకొండ కొన మాత్రమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈడీ దాదాపు 91 ఆస్తులను గుర్తించి, 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నయీం తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఈడీ నిర్ధారించింది.
నయీం డైరీల్లో వివరాల సంగతేమిటి ?
నయీం డైరీల్లో ఉన్న పేర్లు, అతనితో సంబంధం ఉన్న రాజకీయ, పోలీస్ ఉన్నతాధికారుల గుట్టు మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. నయీం ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అతని నివాసం నుంచి సూట్‌కేసుల కొద్దీ నగదు, కేజీల కొద్దీ బంగారం , వేల సంఖ్యలో ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చారు. దాదాపు 2000 ఎకరాలకు పైగా భూములు నయీం అక్రమంగా సంపాదించాడని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఈడీ చూపించిన 11 కోట్ల విలువైన ఆస్తుల లెక్కలు చూస్తుంటే, అసలు రికార్డుల్లో ఉన్న ఆస్తులకు, వాస్తవంగా స్వాధీనం చేసుకున్న వాటికి మధ్య పొంతన లేదని స్పష్టమవుతోంది. సిట్ విచారణ నివేదికలు బయటకు రాకపోవడం, ఆ పత్రాలన్నీ ఏమయ్యాయనేది ఇప్పటికీ ఒక రహస్యమే.
బినామీల లెక్కలు.. పంచుకున్న వాటాదారులు!
నయీం సామ్రాజ్యం కేవలం బెదిరింపులతోనే ఆగలేదు. అందులో ఎంతో మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల భాగస్వామ్యం ఉందనేది బహిరంగ రహస్యం. నయీం బినామీలుగా ఉన్న వారు ఇప్పుడు ఆయా పార్టీల్లో కీలకంగా ఉన్నారని, అందుకే ఈ ఆస్తుల లెక్కలను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచుకోవాల్సిన వాళ్లు పంచుకున్నారు అన్న నానుడికి తగ్గట్లుగానే.. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు చాలా వరకు బాధితులకు చేరలేదని, అవి మళ్ళీ తెర వెనుక ఉన్న పెద్దల చేతుల్లోకే వెళ్లాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసంపూర్తిగా మిగిలిన న్యాయం
ఒకప్పుడు నయీం పేరు చెబితేనే వణికిపోయిన బాధితులు, అతను చనిపోయాక తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డారు. కానీ సిట్ విచారణలో వందల కొద్దీ కేసులు నమోదైనా, శిక్ష పడింది మాత్రం తక్కువ మందే. ఈడీ ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది కానీ, అది మనీ లాండరింగ్ కోణానికే పరిమితం. నయీం కేసు ఒక రాజకీయ-నేరస్థుల అపవిత్ర కలయికకు నిదర్శనం. ఈడీ ఛార్జ్‌షీట్ అనేది ఒక ప్రాథమిక విజయం మాత్రమే. నయీం సామ్రాజ్యంలో వాటాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందుకు తీసుకువచ్చినప్పుడే, ఈ మిస్టరీ వీడుతుంది. లేని పక్షంలో, గ్యాంగ్స్టర్లు మారుతుంటారు కానీ, వారి వెనుక ఉండే వ్యవస్థ మాత్రం అలాగే పదిలంగా ఉంటుందని ఈ కేసు మరోసారి రుజువు చేసినట్లవుతుంది.
