మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ నాయకుడు ఎమ్.వి. మైసూరారెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది! ఆయన వైకాపా నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మౌనంగానే ఉంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశంలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన చేరిక ఉంటుందని తెలుగుదేశం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆయనతో భేటీ అయ్యారు. కడప జిల్లా ఎర్రగుంటలో మైసూరాతో సమావేశమై చర్చలు జరిపారు. ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి రమ్మంటూ సీఎం రమేష్ ఆహ్వానించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ తరుణంలో పార్టీలోకి వస్తే బాగుంటుందనే భావనను మైసూరాకి కలుగజేసినట్టు సమాచారం.
ఓరకంగా చెప్పాలంటే మైసూరాకు తెలుగుదేశంలో చేరడం తప్పనిసరి అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, మైసూరా మొదట్లో వైకాపాలో ఉండేవారు. ఆ పార్టీలో ఆయన ఎదుర్కొన్న అనుభవాల వల్ల కాస్త అసంతృప్తిగా ఉండేవారు. అయితే, అదే తరుణంలో ఆయనకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన గనులను కేటాయించడానికి టీడీపీ ఇబ్బందులు పెట్టిందని అంటారు! గనులను కేటాయించకుండా లేనిపోని కారణాలు చూపిస్తూ ఉద్దేశపూర్వకంగానే మైసూరాని ఇరకాటంలోకి నెట్టిందని కూడా ఓ టాక్ ఉంది.
దాంతో వైకాపా నుంచి మైసూరా బయటకి రావాల్సిన పరిస్థితిని తెలుగుదేశమే కల్పించదనే ఆరోపణలూ ఉన్నాయి! కారణం ఏదైతేనేం వైకాపా నుంచి మైసూరా బయటకి వచ్చేశారు. జగన్తో దోస్తీకి కటీఫ్ చెప్పేశారు. అనూహ్యంగా ఆ తరువాత మైసూరా సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన గనులను ప్రభుత్వం మంజూరు చేసిందనీ కథనాలు అప్పట్లో బాగానే చక్కర్లు కొట్టాయి. కారణం ఏదైతేనేం, మైసూరా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సర్వంసిద్ధం! ఆయన్ని సీఎం రమేష్తోపాటు, బీటెక్ రవి కూడా కలిసి సాదరంగా ఆహ్వానించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆ ముహూర్తం కూడా వెల్లడిస్తారు!
ఇది కూడా ఫిరాయింపుల పర్వంలో మరో కోణం. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పలువురు నాయకులకు భాగస్వామ్యం కల్పిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ!