మునులు, ఋషుల తరవాత దైవ దర్శనం కోసం గట్టిగా ప్రయత్నం చేసింది సినీ రూపకర్తలే. ఇప్పుడు ‘డివైన్’ భలే గిరాకీ ఉన్న జానర్. ఎమోషన్ మిక్స్ చేసిన డివోషన్ ఆడియన్స్ పట్టేస్తుంది. పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న డివైన్ సినిమాల జాబితా గట్టిగానే ఉంది.
రాజమౌళి–మహేష్ బాబు వారణాసి సినిమా జానర్ ఫిక్స్ అయ్యింది. రామాయణంలోని కీలక ఘట్టం ఆధారంగా రూపొందిస్తున్నారు. సోషల్ డ్రామాతో పాటు ఎపిక్ టచ్ ఉన్న సినిమాలో మహేష్ రాముడు పాత్రలో కనిపిస్తారు. మహేష్ ఇప్పటివరకు పౌరాణిక సినిమా చేయలేదు. తొలిసారిగా ఆయన్ని రాముడిగా చూసే క్షణం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.
హనుమాన్ సినిమాకి సీక్వెల్‌గా జై హనుమాన్ రాబోతోంది. రిషబ్ శెట్టి కాంతారతో ఒక డివైన్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. జై హనుమాన్ కూడా క్రేజీ ప్రాజెక్ట్. ఇక ప్రభాస్ కల్కి 2 మొత్తం పురాణాలు ఆధారంగా ఉండబోతోంది. మహాభారతంలోని పాత్రలు ఇందులో కీలకం కానున్నాయి.
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కలిసి చేయబోయే సినిమా కూడా పురాణాలు, దైవంతో ముడిపడిందే. ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’ అంటూ నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు పెంచారు. దీంతో పాటు కార్తికేయుడి తాలూకు సంస్కృత శ్లోకాలను ట్వీట్ చేశారు. శివుడి తనయుడు కార్తికేయుడి కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్రివిక్రమ్‌కు పురాణాల మీద మంచి పట్టుంది. పురాణాలకు ప్రాణం పోసే పాత్రలు చేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లకముందే సంచలనం సృష్టించింది.
అలాగే నాగవంశీ నిర్మాణంలో చందూ మొండేటి దర్శకుడిగా వాయుపుత్ర అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది హనుమాన్ కథే. భారీ సిజీ వర్క్‌తో విజువల్ వండర్లా సినిమాను తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కార్తికేయ 3కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అఖండ 2, మిరాయ్ 2 కథల్లోనూ దైవత్వానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా రాబోతోందట.
ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా మహాకాళి సినిమా రెడీ అవుతోంది. ఇక బాలీవుడ్ నుంచి అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ రణ్‌బీర్ కపూర్ రామాయణం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి మరో రెండేళ్ల పాటు బాక్సాఫీస్‌పై దైవానుగ్రహం గట్టిగా ఉండబోతోంది.