‘నా సామి రంగ’ రివ్యూ: కాస్త క‌ల‌ర్‌… కాస్త ఎమోష‌న్‌

Naa Saami Ranga movie review

తెలుగు360 రేటింగ్ : 2.75/5

– అన్వ‌ర్‌

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో క‌థ‌లు చెప్ప‌గ‌ల‌గాలే కానీ, వింటేజ్ లుక్ తో, ఎమోష‌న్ డ్రామాతో క‌ల‌ర్ ఫుల్ గా తీర్చిదిద్ది మెప్పించొచ్చు. పైగా పండ‌గ సీజ‌న్‌ల‌లో అలాంటి సినిమాని విడుద‌ల చేస్తే.. ఎక్స్ ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. ‘నా సామిరంగ‌’ క‌థ‌ని నాగార్జున ఎంచుకోవడానికీ, దాన్ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ పండ‌గ సీజ‌న్లో విడుద‌ల చేయ‌డానికీ కారణం అదే అయ్యింటుంది. పైగా నాగ్ గత సంక్రాంతి సినిమాలైన ‘సోగ్గాడే చిన్ని నాయిన‌’, ‘బంగార్రాజు’ క‌థ‌ల‌న్నీ ప‌ల్లెటూరి చుట్టూ తిరిగేవే. అందుకే ఈ సారీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. నాగ్‌, అల్ల‌రి న‌రేష్‌, రాజ్ త‌రుణ్‌లతో పోస‌ర్లు అందంగా క‌నిపించ‌డం, కీర‌వాణి సంగీతం.. ఈ చిత్రానికి ఆక‌ర్ష‌ణ తీసుకొచ్చాయి. మ‌రి ‘నా సామి రంగ‌’ ఎలా ఉంది? ఈ సంక్రాంతి పండ‌క్కి స‌రిప‌డా వినోదాన్ని పంచిచ్చిందా..?

కిష్ట‌య్య (నాగార్జున‌), అంజి (న‌రేష్‌) చిన్న‌ప్ప‌టి నుంచీ దోస్తులు. కిష్ట‌య్య అనాథ. అంజి అమ్మ చిన్న‌ప్పుడే చ‌నిపోతుంది. దాంతో… కిట్ట‌య్య‌, అంజి అన్నాద‌మ్ముల్లా పెరుగుతాయి. కిష్ట‌య్య‌కు ఊరి పెద్ద పెద్ద‌య్య (నాజ‌ర్) అంటే విప‌రీత‌మైన గౌర‌వం, విశ్వాసం. పెద్ద‌య్య గీసిన గీత కిష్ట‌య్య దాట‌డు. పెద్ద‌య్య కూడా కిట్ట‌య్య‌ని సొంత కొడుకులానే చూసుకొంటాడు. వ‌ర‌ద‌రాజులు (రావు ర‌మేష్‌) కూతురు వ‌రాలు (అషికా రంగ‌నాథ్‌)ని చిన్న‌ప్ప‌టి నుంచీ ప్రేమిస్తుంటాడు కిష్టయ్య‌. వ‌రాల‌కూ.. కిష్ట‌య్య అంటే ఇష్టం. వీరిద్ద‌రూ పెళ్లికి సిద్ధం అవుతుండ‌గా ఓ అనూహ్య‌మైన ఘ‌ట‌న జ‌రుగుతుంది. దాంతో.. కిష్ట‌య్య‌, వ‌రాలూ దూరం అవుతారు. అదేంటి? పెద్ద‌య్య కొడుకు దాసుతో కిష్ట‌య్య‌, అంజిల‌కు ఏర్ప‌డిన ముప్పేమిటి? భాస్క‌ర్ (రాజ్ త‌రుణ్‌) ప్రేమ‌క‌థ‌.. రెండు ఊర్ల మ‌ధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఇదంతా మిగిలిన క‌థ‌.

మ‌ల‌యాళ చిత్రం `పొరింజు మ‌రియం జోష్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మూల క‌థ‌ని అలానే తీసుకొన్నా, క‌థ‌నంలో, పాత్ర చిత్ర‌ణ‌లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ క‌థ‌ని సంక్రాంతి సీజ‌న్‌లో జ‌రిగిన‌ట్టు చూపించి.. తెలుగు నేటివిటీ తీసుకొచ్చారు. ఎలాగూ సంక్రాంతి సీజ‌న్ న‌డుస్తోంది కాబ‌ట్టి… ఆ వాతావ‌ర‌ణానికి ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట్ అవుతారు. కిష్గ‌య్య‌, అంజిల చిన్న‌ప్ప‌టి స్నేహంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత‌… కిష్ట‌య్య‌, వ‌రాలు ప్రేమ క‌థ మొద‌ల‌వుతుంది. ఆ ల‌వ్ స్టోరీ వింటేజ్ లుక్‌లో సాగుతుంది. కాస్త స‌ర‌దాగా, కాస్త రొమాంటిక్‌గా సాగే ఈ ఎపిసోడ్‌… లెంగ్త్ ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల కాస్త విసిగిస్తుంది కూడా. థియేట‌ర్ సీన్ కొంత వ‌ర‌కూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. వ‌ర‌ద‌రాజులు ఎపిసోడ్ లో క‌థ‌లో కాన్‌ఫ్లిక్ట్ మొద‌ల‌వుతుంది. దాస్ ఎంట్రీతో.. ఈ కథ‌లోకి ఓ విల‌న్ వ‌స్తాడు. తొలి స‌గంలో ఎలాంటి కుదుపులూ లేకుండా సాగిపోతుంది. అలాగ‌ని హై మూమెంట్స్ కూడా ఏం ఉండ‌వు. అంజితో కిష్ట‌య్య స్నేహం, వ‌రాలుతో ల‌వ్ స్టోరీ… ఇదే ఫ‌స్టాఫ్‌లో చెప్పుకోద‌గిన విష‌యాలు. కీర‌వాణి ఇచ్చిన పాట‌ల్లో ‘ఎత్తుకెళ్లిపోవాల‌ని ఉంది’ పాట జోష్ ఇస్తుంది. సినిమా క‌ల‌ర్‌ఫుల్ గా ఉండ‌డం, కీర‌వాణి నేప‌థ్య సంగీతం, ఫైట్లూ.. ఇవ‌న్నీ లోపాల్ని క‌వ‌ర్ చేస్తూ ప్రేక్ష‌కుల్ని కూర్చోబెబ‌డ‌తాయి.

సెకండాఫ్ విష‌య లేమి వ‌ల్ల‌… నిదానంగా సాగుతుంటుంది. ఎప్పుడైతే అంజి ఎపిసోడ్ ముగించారో, అప్పుడే ఈ సినిమా క‌థైపోయిందన్న ఫీలింగ్ క‌లుగుతుంది. క్లైమాక్స్ ఫైట్ అయిపోతే…. లేచి వెళ్లిపోవొచ్చు అనుకొంటున్న త‌రుణంలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన మార్పు.. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు చెప్ప‌ద‌ల‌చుకొన్న విష‌యాన్ని ఎలివేట్ చేస్తుంది. అదొక్క‌టి మిన‌హాయిస్తే.. ద్వితీయార్థంలో పెద్ద‌గా మెరుపులేం ఉండ‌వు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని బాగా ఎలివేట్ చేయ‌డం, సంక్రాంతి బైబ్స్ ఉండ‌డం ఈ సినిమాకి క‌లిసొచ్చే విష‌యాలు. పాట‌లు బాగానే ఉన్నా, మ‌రీ ఎక్కువైపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. మందు పాట‌.. ఎలాంటి కిక్ ఇవ్వ‌క‌పోగా.. సినిమా నిడివి మ‌రింత పెంచింది. పెద్ద‌య్య ప‌ట్ల‌.. కిష్ట‌య్య‌, అంజి అపార‌మైన విశ్వాసం చూపిస్తుంటారు. అంత విశ్వాసంగా ప‌డి ఉండ‌గ‌లిగేంత గొప్ప ప‌ని పెద్ద‌య్య ఏం చేశాడ‌న్న‌ది అంతు ప‌ట్ట‌దు. కిష్ట‌య్య కంటూ గ‌తం ఏమీ ఉండ‌దు. ఆ పాత్ర‌ని అనాథ‌గానే ప‌రిచ‌యం చేస్తారు కానీ, ఆ పాత్ర మూలాల్లోకి వెళ్ల‌లేదు. అంజితో కిష్ట‌య్య స్నేహాన్ని బాగా ఎలివేట్ చేశారు. ప్రేమ క‌థ లెంగ్త్ త‌గ్గించాల్సింది. ఈ వ‌య‌సులోనూ అగ్ర క‌థానాయ‌కులు ల‌వ్ ట్రాక్‌ల‌పై ఇంతింత స‌మ‌యాన్ని వెచ్చించ‌డం కాస్త ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామ‌మే.

నాగార్జున క‌ల‌ర్ ఫుల్‌గా క‌నిపించాడు. త‌న కాస్ట్యూమ్స్ బాగున్నాయి. న‌ట‌న ప‌రంగా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడూ ఆయ‌న్ని క‌ష్ట‌పెట్ట‌లేదు. న‌రేష్ పాత్ర ఆక‌ట్టుకొంటుంది. ఆ పాత్ర‌ని ముగించిన తీరు సానుభూతి క‌లిగిస్తుంది. కాక‌పోతే… గాలి శ్రీ‌ను ఒక్క‌సారి గుర్తొస్తాడు. రాజ్ త‌రుణ్‌ది మ‌రీ అంత గుర్తుపెట్టుకోద‌గిన పాత్ర కాదు. ఆ పాత్ర‌ని ఎవ‌రు చేసినా ఇంతేనేమో…? ఆషికా రంగ‌నాథ్ చూడ్డానికి అందంగా ఉంది. త‌న‌కు ఈ సినిమాతో మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయి. నాజ‌ర్ త‌న అనుభ‌వాన్ని చూపించాడు. సైకో విల‌న్ వ్య‌వ‌హారం కాస్త శ్రుతి మించిన‌ట్టు అనిపిస్తుంది.

కీర‌వాణి ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. మొత్తం 7 పాట‌లిచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ద‌ర్శ‌కుడు బిన్ని.. స్వ‌త‌హాగా నృత్య ద‌ర్శ‌కుడు. కాబ‌ట్టి పాట‌ల్ని బాగా కంపోజ్ చేయ‌గ‌లిగాడు. అవ‌న్నీ క‌ల‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. మ‌ల‌యాళం క‌థ‌ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్చుకోగ‌లిగాడు. అయితే మ‌రీ రీమేక్ చేసుకొని, తీసేంత గొప్ప విష‌యం ఈ క‌థ‌లో ఏముంద‌న్న‌ది అర్థం కాదు. మూడు నెలల్లో తీసిన సినిమా ఇది. అవుట్ పుట్ మాత్రం క్వాలిటీగా ఉంది. `నా సామిరంగ‌` అనే టైటిల్ ని గుర్తు చేయ‌డానికి అన్న‌ట్టు… ప్ర‌తీ సీన్‌లో ఒక్క‌సారి హీరో `నా సామి రంగ‌` అంటూ బీడీ ముట్టిస్తాడు. లేదంటే.. కీర‌వాణి త‌న ఆర్‌.ఆర్‌.లో `నా సామిరంగ‌` అంటూ ఓ బీజియ‌మ్ వినిపిస్తాడు. టైటిల్ ని మ‌రీ ఇన్నిసార్లు గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. మాట‌లు స‌ర‌దాగానే ఉన్నాయి. కాక‌పోతే.. శోభ‌నం సీన్ ద‌గ్గ‌ర న‌రేష్ చెప్పిన డైలాగ్ లోలోతుల్లోకి వెళ్తే ప‌ర‌మ బూతు ధ్వ‌నిస్తుంది. ఈ సంక్రాంతికి క‌ల‌ర్ ఫుల్ సినిమా చూపించ‌డ‌మే ద‌ర్శ‌క నిర్మాత‌ల ఉద్దేశం అయితే…దాన్ని నా సామిరంగ కొంత మేరకు నెర‌వేరుస్తుంది..

ఫినిషింగ్ ట‌చ్‌: పండ‌గ వైబ్స్ ఉన్నాయి రంగ…

తెలుగు360 రేటింగ్ : 2.75/5

– అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close