నా కెరీర్‌లో చాలా కీల‌క‌మైన సినిమా ఇది : నాగ‌చైత‌న్య‌తో ఇంట‌ర్వ్యూ

ఒకే జోన‌ర్‌కి ప‌రిమితం అవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్న క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ల‌వ్, మాస్‌, ఫ్యామిలీ… ఇలా అన్ని ఎమోష‌న్ల‌నీ ట‌చ్ చేసుకొంటూ వెళ్తున్నాడు. ఈయేడాదే.. `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశాడు చైతూ. ఇప్పుడు యుద్దం శ‌ర‌ణం అంటూ మాస్‌ని మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌తో చేసిన చిట్ చాట్ ఇది.

* హాయ్ చైతూ.
– హాయ్‌

* ఈ యుద్ధం ఎవ‌రికోసం?
– ఫ్యామిలీ కోసం. ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మై ఉంటుంది. సింపుల్ గా త‌న జీవితాన్ని గ‌డిపేస్తున్న ఓ యువ‌కుడికి ఓ పెను స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. క‌థ సింపుల్‌గా ఉన్నా, స్క్రీన్ ప్లే మాత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే ఇప్ప‌టి వ‌ర‌కూచూసుండ‌రు. త‌ప్ప‌కుండా ఓ కొత్త సినిమా చూశామ‌న్న తృప్తి ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.

* ఈ చిత్ర ద‌ర్శ‌కుడు మీ స్నేహితుడే. ఫ్రెండ్ కోస‌మే ఈ సినిమా చేశారా?
– ద‌ర్శ‌కుడు కృష్ణ నేనూ చిన్న‌నాటి స్నేహితులం. త‌న‌కి సినిమాలంటే చాలా ప్యాష‌న్‌. నాలుగేళ్లుగా ర‌క‌ర‌కాల క‌థ‌లు రాసుకొని తిరుగుతున్నాడు. కొంత‌మంది హీరోల‌కూ క‌థ‌లు వినిపించాడు. కానీ ఎందుకో సెట్ అవ్వ‌లేదు. ఫైన‌ల్‌గా ఈ క‌థ రాసుకొన్నాడు. కేవ‌లం త‌న‌కోస‌మే ఈ సినిమా చేయ‌లేదు. చాలామంచి క‌థ తీసుకొచ్చాడు. ఆ క‌థ నాకు బాగా న‌చ్చింది. సాయి కొర్ర‌పాటి గారిని ఒప్పిచాం. ఆయ‌న కొత్త క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా నిలిచారు. ఓ చిన్న సినిమాగా పూర్తి చేద్దామ‌నుకొన్నాం. కానీ.. ఆయ‌నేమో దీన్ని పెద్ద సినిమా చేసేశారు.

* కెరీర్‌లో చాలా కీల‌క‌మైన ఫేజ్‌లో వ‌స్తున్న సినిమా ఇది..
– అవును. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ద‌గ్గ‌రైంది. యూత్‌, మాస్‌కి మ‌ళ్లీ క‌నెక్ట్ అవ్వ‌డానికి ఈ సినిమా చేస్తున్నా. ఒక విధంగా నా కెరీర్‌లో చాలా కీల‌క‌మైన సినిమా ఇది.

* ఇదో యాక్ష‌న్ డ్రామానా?
– యాక్ష‌న్ ఉంటుంది. కానీ అదీ కొ్త్త‌గా ఉంటుంది. డ్రోన్ కెమెరా గురించి అంద‌రికీ తెలుసు. దాన్ని ఈ క‌థ‌లో ఓ భాగంగా వాడాం. డ్రోన్ కూడా ఓ పాత్ర‌లా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఎవ్వ‌రూ ఊహించ‌లేరు.

* శ్రీ‌కాంత్‌ని నెగిటీవ్ రోల్ ఒప్పించ‌డం వెనుక‌..
– క‌థ‌లో విల‌న్ పాత్ర చాలా కీల‌కం. అందులో పీక్స్ చూపించే న‌టుడు అవ‌స‌ర‌మైంది. శ్రీ‌కాంత్ అయితే బాగుంటాడ‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల అభిప్రాయం. ఆ పాత్ర‌ని అడ‌గ్గానే ఒప్పుకొన్నారు శ్రీ‌కాంత్‌. ఆయ‌న చాలా బాగా చేశారు.

* లావ‌ణ్య మీ నాన్న‌గారితో న‌టించింది.. ఇప్పుడు మీతో..
– అవును.. చాలా రేర్‌గా జ‌రిగే విష‌యం ఇది. లావ‌ణ్య చాలా సిన్సియ‌ర్ ఆర్టిస్ట్‌. క‌థ త‌న‌కు న‌చ్చితేనే సినిమా ఒప్పుకొంటుంది. త‌న జ‌డ్జిమెంట్‌పై నాకు న‌మ్మ‌కం ఉంది. సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంచుమించు ప్ర‌తీ స‌న్నివేశంలోనూ క‌నిపిస్తుంది.

* స‌వ్య‌సాచి క‌బుర్లేంటి?
– ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో చేస్తున్న సినిమా ఇది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ గా ఉంటుంది. స‌వ్యసాచి అంటే రెండు చేతుల‌తోనూ యుద్దం చేసేవాడ‌ని అర్థం. ఇందులో నా ఎడ‌మ‌చేయి నా మాట విన‌దు. త‌న‌తో క‌థానాయ‌కుడు చేసే పోరాటం ఆక‌ట్టుకొంటుంది.

* మారుతి సినిమా ఏ జోన‌ర్‌లో సాగుతుంది..?
– క‌థ ఏమీ అనుకోలేదు. ఆయ‌న ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. అది అవ్వ‌గానే క‌థ గురించి మాట్లాడుకొంటాం.

* పెళ్లి విశేషాలేంటి?
– అక్టోబ‌రు 6న గోవాలో పెళ్లి జ‌రుగుతుంది. ముందు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి చేసుకొంటాం. ఆ త‌ర‌వాత క్రీస్టియ‌న్ ప‌ద్ద‌తిలో పెళ్లి చేసుకొంటాం. పెళ్లి సింపుల్‌గా చేసుకొన్నా.. రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com