కాళిదాసుతో ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. కరెంట్, అడ్డా అంటూ ఏవో ప్రయత్నాలు చేశాడు. కానీ విజయానికి దూరంగా నిలిచిపోయాడు. డాన్సులు, ఫైటింగులు బాగానే చేస్తాడన్న పేరు తెచ్చుకొన్నా… ఎందుకనో విజయం కనికనించడం లేదు. ఈసారి ఎలాగైనా సరే.. హిట్టు కొట్టాల్సిందే అని ప్రతిన బూని మరీ.. ‘ఆటాడుకుందాం రా’ సినిమా చేశాడట. ఈ ఆటలో సుశాంత్‌ని గెలిపించడానికన్నట్టు మరో ఇద్దరు అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ లు కూడా ఈసినిమాలో మెరవబోతున్నారు. వారిద్దరి ఎంట్రీ అదిరిపోతోందని చెబుతున్నాడు సుశాంత్.
”నాగేశ్వరరెడ్డిగారు కథ చెబుతున్నప్పుడే అందులో చైతన్య క్యారెక్టర్ ఉంది. కానీ మేం అడగలేదు. సినిమా బాగా వచ్చి, దానిపై మాకు నమ్మకం కుదిరితే.. అప్పుడు చైతూని అప్రోచ్ అవుదామనుకొన్నాం. అలానే సినిమా అంతా పూర్తయ్యాక, రషెష్ చూసుకొని మాకు సంతృప్తి కలిగిన తరవాతే.. చైతూని వెళ్లి అడిగా. ‘ఆ పాత్రకు నేను సూటవుతానా’ అని అడిగాడు. ‘నీ కోసమే ఆ పాత్ర రాశాం’ అని చెప్పగానే వెంటనే ఒప్పుకొన్నాడు” అని చెబుతున్నాడు సుశాంత్.
అఖిల్ అయితే.. ‘నీ సినిమాలో నేను కూడా కనిపిస్తా..’ అని స్వయంగా అడిగాడట. అఖిల్ అలా అడిగే సరికి నో చెప్పలేకపోయా అంటున్నాడు సుశాంత్. ”తనకి నా సినిమాలో కనిపించాలనివుందని అమ్మని అడిగాడట అఖిల్. అయితే నేను నమ్మలేదు. నిజమేనా అని అఖిల్‌ని అడిగాను. ఆ తరవాతే అర్థమైంది.. తను నిజంగానే సీరియస్‌గా చెప్పాడని. ఇక ఎందుకు ‘నో’ చెబుతా? అఖిల్ డాన్సుల్లో అదరగొట్టాడు” అంటున్నాడు సుశాంత్. మరి చైతూ, అఖిల్ ల వల్లైనా సుశాంత్‌కి హిట్టు పడితే అంతకంటే సంతోషమేముంది?