ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల రిలేషన్ చాలా కీలకం. వాళ్లిద్దరి మధ్య ట్యూనింగ్ ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తున్నట్టు. సెట్లో గొడవ పడి వెళ్లిపోయిన నిర్మాతలు, అర్థాంతరంగా పేకప్ చెప్పేసిన దర్శకుల లిస్టు చాంతాడంత ఉంటుంది. అలా కాకుండా దర్శక నిర్మాతలిద్దరూ ఫ్రెండ్లీగా కలిసి పని చేసుకొంటూ, ఒకరికి ఒకరు గిఫ్టులు ఇచ్చుకొంటూ ముందుకు వెళ్తుంటే… వాళ్ల బంధమే కాదు, అవుట్ పుట్ కూడా హెల్దీగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాత నాగవంశీ తన దర్శకుడితో అలాంటి రిలేషన్ కోరుకొంటున్నారు. నాగవంశీ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనవన్నీఇనిస్టెంట్ నిర్ణయాలే. కథ నచ్చితే.. సింగిల్ సిట్టింగ్ లోనే దర్శకుడికి అడ్వాన్సు ఇచ్చేస్తారు. దర్శకుడి పని తీరు నచ్చితే, సినిమా పూర్తవ్వకుండానే మరో ప్రాజెక్ట్ లాక్ చేస్తారు. తన హీరోల్ని, దర్శకుల్ని గిఫ్టులతో పడేస్తారు. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ఇది. షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్టాఫ్ చూసిన నాగవంశీ సినిమా హిట్ పై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారని, అందుకే దర్శకుడికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ గిఫ్ట్ ఖరీదు…తన పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది. దర్శకుడికి నాగవంశీ ఇచ్చిన ఆ ఖరీదైన బహుమతి ఏమిటన్నది త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లకు కూడా చురుగ్గా సాగుతున్నాయి. నవీన్ పొలిశెట్టి ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నాడు. త్వరలోనే టీజర్ బయటకు రానుంది.
