నిర్మాత నాగవంశీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన డబ్బులతో పాటు కాస్త బుర్ర పెట్టే నిర్మాత కూడా. అందుకే సక్సెస్ రేట్ అంత బాగుంది. ఆయన సంస్థ నుంచి వస్తున్న సినిమా ‘కింగ్ డమ్’. ఈ సినిమాపై నాగవంశీ చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన కళ్లల్లో నమ్మకం గట్టిగా కనిపిస్తూ వస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో మైలు రాయి అవుతుందన్న విషయం ఆయన బాగా నమ్ముతున్నారు. ఆయన మాటలతో ఫ్యాన్స్ కి కూడా జోష్ వచ్చింది.
అయితే కింగ్ డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశీ సరిగ్గానే ఆలోచించారా? అనే అనుమానాలు వస్తున్నాయి. జులై 31న ఈ సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ‘కూలీ’, ‘వార్ 2’ రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘కింగ్ డమ్’ కీ ఆ రెండు సినిమాలకూ మధ్య రెండు వారాల సమయం ఉంది. కాబట్టి అది సరిపోతుంది. కానీ… ఓ వారం ముందుగా ‘హరి హర వీరమల్లు’ వస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఇది. డిప్యూటీ సీఎం అయిన తరవాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే… బాక్సాఫీసు దగ్గర పవన్ తన ప్రభంజనాన్ని చూపించడం ఖాయం. ఇలాంటి పెద్ద సినిమా వస్తోందంటే రెండు వారాల వరకూ ఏ సినిమా విడుదల చేసే ధైర్యం ఏమాత్రం చేయరు. కానీ వీరమల్లు విడుదలైన వారానికే `కింగ్ డమ్` తెచ్చేస్తున్నారు. పవన్ సినిమా నిలబడితే, రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. హిట్ అయితే ఆ రన్ మూడు వారాల వరకూ ఉంటుంది. అయినా సరే.. నాగవంశీ రిస్క్ చేస్తున్నారు.
అలాగని పవన్ స్టామినా గురించి నాగవంశీకి తెలియనిది ఏం లేదు. పవన్‌కు బాగా కావాల్సిన నిర్మాత ఆయన. పవన్ తో సినిమా కూడా తీశారు. అయినప్పటికీ.. వీరమల్లుని నాగవంశీ లైట్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాగవంశీ మరో వారం ఆగితే.. వీరమల్లు సైలెంట్ అవుతాడు. అప్పుడు ‘కింగ్ డమ్’కి కావల్సినంత స్పేస్ ఏర్పడుతుంది. కానీ మరుసటి వారం రెండు పెద్ద సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. దాని కంటే ‘వీరమల్లు’ని ఢీ కొట్టడమే బెటర్ అన్నది నాగవంశీ ఉద్దేశ్యం కావొచ్చు.
కాకపోతే ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి. వారానికి ఓ పెద్ద సినిమా వస్తే – థియేటర్లకు వెళ్లేంత ఓపిక, తీరిక, డబ్బులు వాళ్ల
దగ్గర ఉంటాయా? అనేది చూడాలి. వీరమల్లు, కింగ్ డమ్ రెండూ పెద్ద సినిమాలే. కచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకొంటారు. అలా పెరిగిన రేట్లని వారం వ్యవధిలో రెండుసార్లు భరించే ఓపిక కూడా ప్రేక్షకులకు ఉండాలి. లేదంటే… ఫుట్ ఫాల్స్ అనుకొన్నంత స్థాయిలో ఉండవు.