టాలీవుడ్ అంతా ఒకటే చర్చ. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తారా, లేదంటే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలిసి చేస్తారా? అని. ‘గాడ్ ఆఫ్ వార్’ కథని త్రివిక్రమ్ ఎవరితో పట్టాలెక్కిస్తారు? అనే కన్ఫ్యూజన్ ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ వుంది. ముందు ఈ కథ బన్నీ దగ్గరకు వెళ్లింది. అట్నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ‘డ్రాగన్’ తరవాత ఎన్టీఆర్ సినిమా.. త్రివిక్రమ్ తోనే అనుకొన్నారు. సడన్ గా మళ్లీ కథ మారింది. కాంబో మారిందన్న ప్రచారం మొదలైంది. ఈ సినిమా మళ్లీ బన్నీ దగ్గరకు వెళ్లిందని టాలీవుడ్ అంతా టామ్ టామ్ అయిపోయింది. దీనిపై బన్నీ టీమ్ గానీ, త్రివిక్రమ్ సన్నిహితులు కానీ, ఈ సినిమా నిర్మిస్తున్న నాగవంశీ కానీ నోరు మొదపడం లేదు.
‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నాగవంశీ కొన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నాగవంశీ ఎప్పుడూ ఏదీ దాచుకోరు. అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబోకి సంబంధించిన ప్రశ్నని స్కిప్ చేశారు. ‘గాడ్ ఆఫ్ వార్’ ఎవరితో ఎప్పుడు? అనే ప్రశ్న రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగు360 ఇంటర్వ్యూలోనూ ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. ‘త్వరలో వివరాలు చెబుతా’ అంటూ సమాధానం దాట వేశారు.
నిజానికి అటు ఎన్టీఆర్, ఇటు బన్నీ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగవంశీ ఓ క్లారిటీ ఇస్తే సరిపోయేది. కానీ సమాధానం చెప్పడం లేదు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా దాన్ని రకరకాలుగా అభివర్ణించుకొంటారన్న భయం నాగవంశీలో ఉండి ఉంటుంది. పైగా ముందు బన్నీ అనుకొన్నారు. తరవాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ఇప్పటికే చేతులు మారిన ఈ ప్రాజెక్ట్ గురించి.. మళ్లీ మళ్లీ మాట్లాడుకోవడం ఎందుకు? అని భావించి ఉంటారు. పైగా త్రివిక్రమ్ సినిమాల విషయంలో చాలా గోప్యత పాటిస్తారు నాగవంశీ. ఆయన అనుమతి లేకుండా ఏ విషయాన్నీ లీక్ చేయలేరు. అందుకే.. ‘గాడ్ ఆఫ్ వార్’ గురించి నాగవంశీ నోరు మెదపడం లేదేమో?
