జనసేన పార్టీలో నాగబాబు తన పాత్ర కుదించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ గా పార్టీ కోసం గ్రౌండ్ లెవల్లో కష్టపడి తిరుగుతారని అనుకున్నారు. కానీ ఆయన తరవాత అనూహ్యంగా ఇనాక్టివ్ అయ్యారు. పెద్దగా స్పందించడం లేదు. అదే సమయంలో ఆయన చేయాల్సిన పనులను సినీ నిర్మాత రామ్ తాళ్లూరికి పవన్ అప్పగించారు. దీంతో నాగబాబు ఎందుకు తన పాత్ర తగ్గించుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
మంత్రి పదవి ఖరారు చేసిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాగబాబుకు మంత్రి పదవిని ఖరారు చేశారు. ఓ సారి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో లీ ఈ విషయాన్ని చెప్పారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కాక ముందే మంత్రిగా ప్రమాణం చేస్తారని అనుకున్నారు.కానీ ఎమ్మెల్సీ అయ్యాకే చేస్తారని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అయినా ఇప్పటి వరకూ మంత్రిగా ప్రమాణం చేయలేదు. సరి కదా ఆయన తన యాక్టివ్నెస్ తగ్గించుకున్నారు.
ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లోనూ దూరం !
జనసేన పార్టీలో నాగబాబుకు ప్రత్యేకమైన పాత్ర ఉండేది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. నాదెండ్ల మనోహర్ ఫీల్డ్ వ్యవహారాలు చూసుకుంటే మిగతా అన్నీ పార్టీ ఆఫీసు నుంచి చూసుకునేవారు. ఇప్పుడు ఆయన బాధ్యతలన్నీ రామ్ తాళ్లూరికి ఇచ్చారు. ఆయన రోజూ పార్టీ ఆఫీసుకు వచ్చి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. నాగబాబు లేని లోటును తీరుస్తున్నారు.
అప్పుడప్పుడే క్షేత్ర స్థాయి పర్యటనలు
నాగబాబు జనసేన పార్టీ కోసం క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా తగ్గించుకున్నారు. ఎప్పుడో ఓ సారి ఏదైనా జిల్లాకు వెళ్తున్నారు. మండలి సమావేశాలు జరిగితే వెళ్తున్నారు. అంతకు మించి ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకలా అన్నది జనసేన పార్టీ వర్గాలకూ అర్థం కావడం లేదు. ఆయన మాట్లాడటం వల్ల ఎక్కువ వ్యతిరేక ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం కింది స్థాయి క్యాడర్ లో ఉంది. అందుకే నాగబాబు యాక్టివ్ గా లేని లోటు పెద్దగా ఫీల్ కావడం లేదు.