ఏపీ మంత్రి రోజా ఇటీవల మెగా కుటుంబం పై చేసిన విమర్శలపై స్పందించారు నాగబాబు. అయితే ఏదో విమర్శించాలి అంటే విమర్శించాలి అన్నట్టు కాకుండా మంత్రిగా రోజా వైఫల్యాలను హైలెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కూడా రోజా పై అసహనం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
నిజానికి రోజా మెగా ఫ్యామిలీ పై నోరు పారేసుకోవడం కొత్త కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నుండి ఆమె రాజకీయ భవిష్యత్తు మెగా ఫ్యామిలీ మీద విమర్శల ద్వారానే నిర్మించుకుంది అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు కూడా. అయితే తాజాగా ఆవిడ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురిని జత కలిపి, వీరు ముగ్గురు ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం చేయలేదు అని, అందుకే గోదారి జిల్లాల ప్రజలు వీరి ముగ్గురిని ఓడించారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వినగానే జనసైనికులు మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ రాష్ట్రానికి అనేక విధాలుగా చేసిన అనేక రకాల సేవలను గుర్తు చేస్తూ రోజాపై విమర్శలు వర్షం కురిపించారు.
అయితే తాజాగా నాగబాబు స్పందిస్తూ, దేశంలోని 20 రాష్ట్రాల పర్యటక శాఖల ర్యాంకింగ్ లను వివరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ 18 వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కేరళ అస్సాం గుజరాత్ లాంటి రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గడ్ జార్ఖండ్ చివరి మూడు స్థానాలలో ఉన్నాయని గుర్తు చేశారు. చత్తీస్గడ్ జార్ఖండ్ల విషయంలో నక్సల్ సమస్యలతో పాటు పలు ఇతర సమస్యల కారణంగా అక్కడి పర్యాటకశాఖ అభివృద్ధి కావడం లేదన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అట్టడుగునా నిలిపిన రోజా తాను మాత్రం పర్యటనలు చేస్తోందని, పర్యాటక శాఖ మంత్రి అంటే తాను పర్యటనలు చేయడం కాదని, పర్యాటకశాఖ మీద ఆధారపడ్డ వేలాది ప్రజల జీవితాలు బాగుపడేలా చేయడం ఆ మంత్రి బాధ్యత అని గుర్తు చేశారు. తన బాధ్యతలు పక్కన పెట్టి అర్థం లేని విమర్శలు చేస్తున్న రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టి లాంటిది అని కౌంటర్ ఇచ్చారు నాగబాబు.
అయితే రోజా మెగా ఫ్యామిలీ ని అనవసరంగా కెలకడం వల్లనే , దానికి నాగబాబు ఇచ్చిన కౌంటర్ వల్లే పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత హీనంగా ఉన్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందని, అనవసరంగా ప్రభుత్వ పరువు తీసేలా రోజా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలు రోజా మీద గుర్రు గా ఉన్నట్టు సమాచారం.