వీర సింహారెడ్డి ట్రైలర్ అదిరిపోయింది. మాస్‌కి పండగలా అనిపిస్తోంది. బాలయ్య ఎలివేషన్లు, దానికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా డైలాగులు దద్దరిల్లాయి. ఈ సినిమాలో… ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు పడ్డాయన్న వార్తలు ముందు నుంచీ వినిపిస్తున్నాయి. ట్రైలర్‌లోనే దానికి హింటు దొరికేసింది.
”సంతకాలు పెడితే…. బోర్డు మీద పేరు మారుతుందేమో..? కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు” అనే డైలాగ్ ట్రైలర్‌లో ఉంది. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీన్ని ఉద్దేశించే ఈ సంతకాల డైలాగ్ పెట్టారన్నది ఎవరూ చెప్పకపోయినా అర్థమైపోయే వ్యవహారం. అందుకే సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ డైలాగ్ ని .. వర్సిటీ పేరు మార్పుకు అన్వయించుకొంటూ… పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా ఉన్నాయని వినికిడి. ముఖ్యంగా `ఆల్ ఫ్రీ` పథకాలపై కూడా బాలయ్య సెటైర్లు వేశాడట. పాలన అంటే ఎలా ఉండాలి? అని చెబుతూ మూడు పేజీల సుదీర్ఘమైన డైలాగ్ ఈ సినిమాలో ఉందని, ఆ డైలాగ్ సైతం పొలిటికల్ గా హీట్ పెంచుతుందని సమాచారం.