‘దేవ‌దాస్‌’పై నాగ్ అలా అనేశాడేంటి?

నాగార్జున – నాని చేసిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై చాలా మంచి అంచ‌నాలున్నాయి. అయితే… వాట‌న్నింటి గాలి తీసేస్తూ.. నాగ్ నోరు జారాడు. `రెండ్రోజుల క్రిత‌మే సినిమా చూశాను… ఇంకొంచెం ముందు చూపించి ఉంటే.. బాగుండేది` అంటూ స్టేట్‌మెంట్ విసిరాడు. ప్ర‌తీ సినిమా కాస్త ముందుగానే చూసుకుని మార్పులు చేర్పులు చేసుకోవ‌డం నాగ్‌కి అల‌వాటు. కానీ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఆ అవ‌కాశం లేకుండా చేశాడు. విడుద‌ల‌కు వారం రోజుల ముందు కూడా సినిమా సిద్ధం చేయ‌లేదు. దాంతో నాగ్ కాస్త సీరియెస్ అయ్యాడ‌నిపిస్తుంది. ‘క‌నీసం నెల రోజుల ముందు సినిమా చూపిస్తే నిర్మాత‌ల‌కు మంచిది. శ్రీ‌రామ్ ఆదిత్య ఇక ముందు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది’ అన్నాడు నాగ్‌. ఈ సినిమా విడుద‌లై, కాస్త అటూ ఇటూ అయితే… ‘చివ‌ర్లో ఏమైనా చేయ‌డానికి అంత టైమ్ లేకుండా పోయింది’ అని చెప్పుకోవ‌డానికి నాగ్‌కి ఓ వంక దొరికిన‌ట్టైంది. ఏ సినిమా విష‌యంలోనైనా ఇలా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటాడు నాగ్. ఇప్పుడు `దేవ‌దాస్‌` విష‌యంలోనూ అదే చేశాడు. ఈ స్టేట్‌మెంట్‌… ‘దేవ‌దాస్‌’పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మ‌రి!

నాగ్ మాట‌ల‌తో అలిగిన ద‌ర్శ‌కుడు

నాగార్జున‌తో వ‌చ్చిన చిక్కే అది. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడేస్తుంటాడు. దాని ప‌ర్య‌వ‌సానాలేంట‌న్న‌వి అస్స‌లు ప‌ట్టించుకోడు. `భాయ్‌` రిలీజ్ అయ్యాక‌… వీర‌భ‌ద్ర‌మ్ పై చేసిన వ్యాఖ్య‌లు.. ప‌రోక్షంగా ఆ ద‌ర్శ‌కుడి కెరీర్‌కి ఆటంకంగా మారాయి. ఈసారి ఆయ‌న శ్రీ‌రామ్ ఆదిత్య‌పై సెటైర్లు వేయ‌డం మొద‌లెట్టారు. `లేజీ ఫెలో` అంటూ శ్రీ‌రామ్ ఆదిత్య గురించి ముందు నుంచీ చెబుతూనే వ‌చ్చాడు నాగ్‌. `చెప్పిన స‌మ‌యానికి సెట్‌కి రాడు` అంటూ ఆడియో ఫంక్ష‌న్లోనే శ్రీ‌రామ్‌పై చుర‌క వేశాడు. నిజానికి సెట్లో అంద‌రికంటే ముందు ఉండాల్సింది ద‌ర్శ‌కుడే. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌లా స్టార్ డ‌మ్ వ‌చ్చాక‌… అయితే సెట్లో అన్నీ సెట్ట‌య్యాకే ద‌ర్శ‌కుడు అడుగుపెట్టొచ్చు. ఇప్పుడిప్పుడే కెరీర్‌ని ముందుకు న‌డిపిస్తున్న శ్రీ‌రామ్ లాంటి ద‌ర్శ‌కుడు మాత్రం అంద‌రికంటే ముందు సెట్లో ఉండాల్సిందే. కానీ.. ఈ విష‌యంలో నాగ్‌కి, చిత్ర‌బృందానికీ శ్రీ‌రామ్ దొరికిపోయాడ‌నే చెప్పాలి.

అది చాల‌ద‌న్న‌ట్టు ఈరోజు ప్రెస్ మీట్లో `రెండు రోజుల ముందు సినిమా చూపించాడు. మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం లేకుండా పోయింది` అనేశాడు నాగ్‌. ఇదంతా శ్రీ‌రామ్ ఆదిత్య‌ని ఇబ్బంది పెట్టే వ్య‌వ‌హార‌మే. నాగ్ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా శ్రీ‌రామ్ ఆదిత్య ప‌నిత‌నాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. ముందే సిద్ధం కావాల్సిన సినిమా మొత్తం…. శ్రీ‌రామ్ బ‌ద్ద‌కం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌న్న‌ది నాగ్ మాట‌ల్ని బ‌ట్టి తేలుతోంది. దాంతో పాటు… మార్పులు చేర్పులూ చేయాల్సిన అవ‌స‌రం ఉంది గానీ, దానికి స‌మ‌యం లేదంటూ త‌ప్పంతా శ్రీ‌రామ్‌పై నెట్టేశాడు. `లేజీ ఫెలో` అనే కామెంట్‌ని ఏదోలా ఓర్చుకున్న శ్రీ‌రామ్‌… ఈ తాజా కామెంట్ల‌కు మాత్రం నొచ్చుకున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ప్రెస్ మీట్లోనే కాస్త ఇబ్బందిగా మాట్లాడిన శ్రీ‌రామ్‌.. ఆ త‌ర‌వాత ఇచ్చిన ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూల్లోనూ అలానే ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలుస్తోంది. సినిమా విడుద‌లై మంచి టాక్ వ‌స్తే.. ఇప్పుడు నాగ్ చెప్పిన మాట‌ల‌న్నీ జనం మ‌ర్చిపోతారు. ఏదైనా తేడా వ‌స్తేనే.. వేళ్ల‌న్నీ శ్రీ‌రామ్ వైపు చూపిస్తాయి. శ్రీ‌రామ్ భ‌యం కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com