‘ఘోస్ట్’ ఎంట్రీ: క‌త్తి దూసిన నాగార్జున‌

నాగార్జున‌ని చాలామంది ద‌ర్శ‌కులు రొమాంటిక్ హీరోగానే చూశారు. వ‌య‌సు పెరిగినా ఆయ‌న ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కే ఎక్కువ ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న‌లో ఓ యాక్ష‌న్ హీరో కూడా ఉన్నాడు. ఇప్ప‌టికీ నాగ్ కి యాక్ష‌న్ క‌థ‌లు చేయాల‌ని ఉంది. అందుకే.. ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమాల్ని ఎంచుకొన్నారు. ఫ‌లితం ఎలా ఉన్నా – న‌టుడిగా ఆయ‌న్ని ఆయ‌న సంతృప్తి ప‌ర‌చుకుంటున్నారు. ‘ఘోస్ట్’ కూడా యాక్ష‌న్ డ్రామానే. ముందు నుంచీ ఈ సినిమాని అలానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడైతే `ఘోస్ట్`లో యాక్ష‌న్ ఏ రేంజ్‌లో ఉంటుందో ‘రెడ్ నోటీస్‌’ అనే ఓ ప్రోమో ద్వారా చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

‘విక్ర‌మ్‌.. నువ్వెక్క‌డ ఉన్నావో వాళ్ల‌కు తెలిసిపోయింది.. అండ‌ర్ వ‌ర‌ల్డ్ మొత్తం నిన్ను వెదుక్కొంటూ వ‌స్తోంది’ అనే ఫోన్ కాల్ తో విక్ర‌మ్ (నాగార్జున) అలెర్ట్ అవ్వ‌డం.. వాళ్ల‌ని ఎదుర్కోవ‌డానికి ఓ క‌త్తి సిద్ధం చేయ‌డం.. ఇదీ ప్రోమోలో క‌నిపిస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో క‌త్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దానికి త‌గ్గ‌ట్టుగానే క‌త్తి త‌యారు చేయ‌డం చుట్టూ ఈ ప్రోమో సాగింది. విజువ‌ల్స్‌, ఆర్‌.ఆర్‌… అన్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తున్నాయి. ఈ ప్రోమో వెనుక ‘విక్ర‌మ్‌’ స్ఫూర్తి ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ‘విక్ర‌మ్’ తొలి ప్ర‌చార చిత్రం కూడా ఇలానే క‌ట్ చేశారు. ‘విక్ర‌మ్‌’ థీమ్ ఏమిటో ఆ ప్రోమో ద్వారా చెప్పారు. విష‌యం ఏమిటంటే… విక్ర‌మ్ లో ఆ ప్రోమో షాట్లూ, సీన్లూ లేవు. మ‌రి… ‘ఘోస్ట్‌’ విష‌యంలో ఏం జరుగుతుందో. ప్ర‌వీణ్ స‌త్తారు దర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఈనెల 25న ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తారు. అక్టోబ‌రు 5న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.