అనూహ్యంగా రాజకీయ వర్గాల్లో ఈ చర్చ ఇప్పుడు జరుగుతోంది! ప్రముఖ సినీ నటుడు నాగార్జున వైకాపాలో చేరే అవకాశం ఉందంటూ ఓ చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే, ఇప్పుడే ఈ చర్చ ఎందుకు వచ్చిందీ అంటే… ఈ మధ్యనే నాగ్ చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. అఖిల్ పెళ్లిచేసుకోబోతున్న శ్రేయా భూపాల్ జీవీకే రెడ్డికి మనవరాలు. ఇక, జీవీకే రెడ్డికీ ప్రతిపక్ష నేత జగన్‌కూ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు. అంటే, ఇప్పుడు నాగార్జునకు కూడా ఏదో ఒక కోణం నుంచి జగన్‌తో బంధుత్వం కలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ నిశ్చితార్థం సమయంలోనే ఇలాంటి చర్చేదో జరిగిందన్న పుకారు వినిపిస్తోంది.
సరే, అది పుకారే అనుకున్నా… జగన్మోహన్రెడ్డికీ, నాగార్జునకు మంచి సంబంధాలే ఉన్నాయనడానికి ఇంకో కనెక్షన్ కూడా ఉంది కదా! మ్యాట్రిక్స్ ప్రసాద్‌గా పిలవబడే నిమ్మగడ్డ ప్రసాద్, నాగ్ల మధ్య మాంచి వ్యాపార సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. వైయస్ హయాంలో ఆయన ఫ్యామిలీకి నిమ్మగడ్డకూ మాంచి దోస్తీ ఉండేది. ఆ రకంగా నాగ్-జగన్‌లు క్లోజ్ అనే అభిప్రాయం ఉంది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో గతంలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయన్ని నాగ్ కలుసుకోవడానికి వెళ్లిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.
ఎలా చూసుకున్నా… నాగార్జున వైకాపాకి దగ్గర కావొచ్చు అనడానికి కావాల్సిన బలమైన ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడీ చర్చ ఎలా తెరపైకి ఇచ్చిందన్నది ఇంకా సరైన కారణాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే నాగార్జున వైకాపాలోకి వస్తే… కచ్చితంగా సంచలనమే అవుతుంది. ఎందుకంటే, అన్ని వర్గాల్లో ప్రజల్లో మాంచి గుర్తింపు ఉన్న స్టార్స్‌లో నాగ్ ఒకరు. అంతేకాదు, ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వస్తే వైకాపాలో నాగార్జున పాత్ర ఏంటనేది కూడా ఇప్పటికైతే ఊహకందని ప్రశ్నే. ఎందుకంటే, వైకాపాలో కరిజ్మా ఉన్న నాయకుడు ఒక్కడే ఉండాలి. అది జగన్ మాత్రమే అయి ఉండాలనే ధోరణి సాక్షాత్తూ అధినేతకే ఉందన్న అభిప్రాయం కూడా ప్రచారంలో ఉంది కదా! మరి, ఈ వార్తల్లో వాస్తవాల పాళ్లు ఏమాత్రమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే!