ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ ప్రోమో బయటకు వదిలారు. నాని త్వరలోనే సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. ఈ సినిమాలోని కథేమిటో.. అందులోని నాని పాత్ర ఎలా ఉండబోతోందో.. ఈ కాన్సెప్ట్ ప్రోమోలోనే రివీల్ చేశారు. ఇందులో హీరో చెఫ్ కమ్ గ్యాంగ్ స్టర్. హోటెల్ లో చెఫ్ గా కనిపించే హీరో గ్యాంగ్ స్టర్ గా మారాల్సివచ్చిందా, లేదంటే గ్యాంగ్ స్టరే… చెఫ్ గా రూపం దాల్చాల్సివచ్చిందా అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కాన్సెప్ట్ ప్రోమో సరదాగా ఉన్నా.. సుజిత్ ఈ స్క్రిప్టు పట్ల, మేకింగ్ పట్ల ఎంత సీరియస్ గా ఉన్నాడో తెలియజేసింది. నానిని గ్యాంగ్ స్టర్ గా చూడడం ఇదే తొలిసారి. పైగా సుజిత్ గ్యాంగ్ స్టర్ కథలకు పెట్టింది పేరు. సాహో, ఓజీ రెండూ గ్యాంగ్ స్టర్ కథలే. అందులో హీరోల్ని చూపించిన విధానం అభిమానుల్ని ఆకట్టుకొంది. మరి ఈసారి నానిని ఎలా చూపించబోతున్నాడో..?
నాని ప్రస్తుతం ‘పారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అవ్వగానే `బ్లడీ రోమియో` సెట్లో అడుగుపెడతాడు. ప్రస్తుతానికి బ్లడీ రోమియోకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కథానాయికగా త్రిప్తి డిమ్రి (యానిమల్ ఫేమ్) పేరు బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల్లో వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
