బిగ్ బాస్ నా క‌ళ్లు తెరిపించింది – నానితో ఇంట‌ర్వ్యూ

క్రికెట్‌లో కోహ్లిలా.. సినిమాల్లో నాని చెల‌రేగిపోతున్నాడు. సోలో హీరోగా ఒక ప‌క్క‌… `నేచుర‌ల్ స్టార్‌` అనే స్థానాన్ని సంపాదించుని.. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లోనూ మెరుస్తున్నాడు. ఇంకోవైపు బుల్లి తెర‌పై `బిగ్ బాస్‌` షోతో అల‌రిస్తున్నాడు. గ‌త నాలుగు నెల‌ల్లో ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా… నిత్యం బిజీ బిజీగా గ‌డిపాడు నాని. నానిని దాసుగా మార్చిన `దేవ‌దాస్‌` రేపు విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా నానితో చిట్ చాట్‌.

* నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోతో తొలిసారి న‌టించారు… సెట్‌కి వెళ్లే ముందు భ‌యాలు గ‌ట్రా వేయ‌లేదా?

– చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌… వీళ్ల సినిమ‌లు చూసి పెరిగిన‌వాడ్ని. వాళ్లు మిన‌హా ఇప్పుడున్న హీరోలంతా నా క్లాస్ మేట్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. కొంత‌మంది ఫ్రంట్ బెంచ్‌.. అవ్వొచ్చు. కొంద‌రివి వెనుక సీట్లు కావొచ్చు. కానీ నాగ్ సార్ అనేస‌రికి.. చాలా సీనియ‌ర్ క‌దా? ఆయ‌న‌తో ఎలా క‌లిసిపోగ‌ల‌ను? అనిపించింది. `దేవ‌దాస్‌` పూర్తిగా ఫ‌న్ సినిమా. అది వ‌ర్క‌వుట్ అవ్వాలంటే.. సెట్లోనే సీన్‌ని ఇంప్రూవ్ చేయాలి. నేనూ, నాగ్ అలా క‌ల‌సిపోతామా, లేదా? అనుకునేవాడ్ని. కానీ తొలిరోజే నా భ‌యాల‌న్నీ పోగొట్టారు నాగార్జున‌. తొలి రోజు క్లీనిక్ ఎపిసోడ్ తీశాం. లంచ్ టైమ్‌కి మా ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ఏర్ప‌డిపోయింది. నేను ఏదైనా ఐడియా.. చెబితే.. ఆయ‌న మ‌రోటి చెప్పేవారు. నా వ‌య‌సున్న హీరోతో క‌ల‌సి న‌టించిన ఫీలింగ్ వ‌చ్చేసింది. సెట్లో దేవ దాస్ లానే మారిపోయాం. అదే ఫీలింగ్ చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగింది.

* నాగ్ అన‌గానే ఓ స్టార్ హీరో గుర్తుకు వ‌స్తారు.. సెట్లో మీకూ అలానే అనిపించేదా?

– అవును. ఆయ‌న్నెప్పుడు చూసినా నాకు అదే ఫీలింగ్‌. నిన్నే పెళ్లాడ‌తా సినిమా కోసం దేవి 70 ఎమ్ ఎమ్ ముందు టికెట్ల ముందు నిల‌బ‌డిన విజువ‌ల్స్ గుర్తొచ్చేవి. క‌టౌటు, టికెట్టే క‌నిపించేవి. ఆ ఫీలింగ్ ఎప్పుడు పోతుందో తెలీదు

* ఈ ప్రాజెక్టు లోకి శ్రీ‌రామ్ ఆదిత్య ఎలా వ‌చ్చాడు?

– నాకు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు ప‌రిచ‌యం లేదు. మా ద‌గ్గ‌ర ఓ ఐడియా ఉంది. దాన్ని పూర్తి స్థాయి సినిమాగా ఎవ‌రు మారుస్తారు? అని వెదికాం. దేవ‌దాస్ క‌థ‌ పూర్తి క‌మ‌ర్షియల్‌గా ఉండ‌కూడ‌దు. అలాగ‌ని మ‌రీ రియ‌లిస్టిక్‌గా ఉండ‌కూడ‌దు. మ‌ధ్య‌స్థంగా ఎవ‌రు చేయ‌గ‌ల‌రా? అని ఆలోచించాం. చాలా రోజుల పాటు ఏ ద‌ర్శ‌కుడూ మా మైండ్ లోకి రాలేదు. `మంచి ద‌ర్శ‌కుడు దొరికిన‌ప్పుడు చేద్దాం.. అంత వ‌ర‌కూ ప‌క్క‌న పెట్టేద్దాం` అనుకున్నాం. స‌రిగ్గా అప్పుడే శ‌మంత‌క‌మ‌ణి, భ‌లే మంచి రోజు ట్రైల‌ర్లు చూశాను. శ్రీ‌రామ్ ఆదిత్య కోసం ఆరా తీశాను. త‌న క‌థ కంటే క‌థ‌నం బాగుంటుంది అని చెప్పారంతా. మా ద‌గ్గ‌ర క‌థ ఉంది క‌దా? అని అత‌ని చేతుల్లో పెట్టాం.

* మ‌రి మీ క‌థ‌కు శ్రీ‌రామ్ న్యాయం చేశాడా?

– ఈ క‌థ అత‌ని చేతుల్లో పెట్టేట‌ప్పుడు ఒక్క‌టే అన్నాను. `40 రోజుల పాటు టైమ్ తీసుకో. స్క్రిప్టు రెడీ చేసి తీసుకురా. న‌చ్చితే చేస్తాం.. లేదంటే లేదు` అన్నాను. దానికి ఒప్పుకునే శ్రీ‌రామ్ స్క్రిప్టు మొద‌లెట్టాడు. స‌రిగ్గా 40 రోజుల త‌ర‌వాత వ‌రంగ‌ల్ వ‌చ్చి.. క‌థ మొత్తం చెప్పాడు. ` ఫ‌ర్లేదు, బాగానే ఉంది` అనిపించినా ఈ సినిమా నుంచి త‌ప్పుకుందాం అనే ఆలోచ‌న‌లో ఉన్నా. ఎందుకంటే… క‌థ ఎంత బాగా న‌చ్చినా.. కాల్షీట్లు సర్దుబాటు చేసే ప‌రిస్థితిలో లేను. కానీ శ్రీ‌రామ్ క‌థ చెప్పిన విధానం న‌చ్చి.. `వ‌ద్దు` అనుకున్న సినిమానే చేయాల్సివ‌చ్చింది.

* సోలో హీరోగా హిట్లు కొడుతున్నారు.. ఈ స‌మ‌యంలో మ‌ల్టీస్టార‌ర్ అవ‌స‌ర‌మా అనే భ‌యాలేం వేయ‌లేదా?

– నాకు అస్స‌లు అలాంటి భ‌య‌మే లేదు. ఇమేజ్ ని న‌మ్ముకున్న న‌టుడ్ని కాదు నేను. నా క‌టౌట్ బాగుంద‌ని నా సినిమాకి ఎప్పుడూ రారు. సినిమాని ఎంజాయ్ చేద్దాం అని వ‌చ్చే ఆడియ‌న్స్ ఉన్నారు. వాళ్లకు మంచి సినిమా ఇవ్వాలంతే. ప‌దేళ్ల క్రితం ఎలాంటి నేప‌థ్యం లేకుండా వ‌చ్చిన న‌టుడ్ని నేను. అలాంటి నాతో నాగ్ సార్ క‌ల‌సి న‌టించ‌డ‌మే గొప్ప అదృష్టం. పైగా మ‌ల్టీస్టారర్లు ఎప్పుడు చేస్తారు? అని మీడియా అంతా అడుగుతుంటుంది. అలాంట‌ప్పుడు ఆ అవ‌కాశం వ‌స్తే ఎందుకు చేయ‌ను?

* మ‌ల్టీస్టార‌ర్ చేయాల్సివ‌స్తే నానితోనే చేస్తా.. అని నాగ్ అన్నార్ట‌. ఈ మీట విన్నారా?

– ఆ మాట చాలా హ్యాపీగా అనిపించింది. ఓ అవార్డు ఫంక్ష‌న్‌కి నాగ్‌, అమ‌ల‌.. వ‌చ్చారు. దానికి రానా, నేను యాంక‌రింగ్ చేస్తున్నాం. ఆ స‌మ‌యంలో రెడ్ కార్పెట్ ద‌గ్గ‌ర నాగ్ సార్ మాట్లాడుతూ `నాని నాకు చాలా ఇష్ట‌మైన న‌టుడు` అని చెప్పారు. అమ‌ల మేడ‌మ్ అయితే `తెలుగు ఎంత బాగా మాట్లాడ‌తాడండీ` అని మెచ్చుకున్నారు. ఆ వీడియో చూసి ఎంత మురిసిపోయానో. ఇంటికెళ్లి మా ఆవిడ‌కు, అమ్మ‌కు చూపించా. నాపై ఉన్న ఇంత మంచి ఫీలింగ్ చెడ‌గొట్టుకో కూడ‌దు… అనే భ‌యంతో ఈ సినిమా చూశా. ఈ సినిమా అయిపోయేట‌ప్ప‌టికి నా మీదున్న అభిప్రాయం పోకుండా ఉంటే చాలు అనుకున్నా.

* మీరు.. మీ సెల్ ఫోన్ల‌పై నాగ్ జోకులు వేస్తున్నారు..

– ట్రైల‌ర్ కంటే ఆ వీడియోనే ఎక్కువ వైర‌ల్ అయిపోయింది. అయితే నాగ్ సార్ ఉన్న‌ప్పుడు ఫోన్లు ముట్టుకోలేదు. ప్రొడ్యూస‌ర్లు నా ఫ్రెండ్సే కాబ‌ట్టి… నాపై, నా సెల్‌ఫోన్ పై జోకులు వేశారు. దాన్ని నాగ్ సార్ గ‌ట్టిగా ప‌ట్టుకున్నారంతే.
నిజానికి నేనంతగా ఫోన్ల‌కు ఎడిక్ట్ అవ్వ‌లేదు.

* మ‌ల్టీస్టార‌ర్ జోన‌ర్‌ని ఎంజాయ్ చేశారా?

– మ‌ల్టీస్టార‌ర్ చాలా కంఫ‌ర్ట్‌గా అనిపించింది.చాలా ఎంజాయ్ చేశా. ఇద్ద‌రు హీరోలు క‌దా నాపై ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అనుకున్నా. కానీ ఏమార్పూలేదు. సోలో హీరోగా నా సినిమా వ‌స్తున్న‌ప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో ఇప్పుడూ అలానే ఉంది.

*మీ విజ‌యాల ప‌రంప‌ర‌కు కృష్ణార్జున యుద్దం బ్రేకులు వేసింది క‌దా? ఆ సినిమా ఎందుకు చేశానా అనిపించిందా?

– కృష్ణార్జున యుద్దం మ‌రీ చెత్త సినిమాకాదు. కానీ రిజ‌ల్ట్ రాలేదు. ఈ సినిమా రూపంలో నా దిష్టి పోయింది అనుకున్నానంతే. మిగిలిన అన్ని సినిమాల‌కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డా. తొమ్మిది విజ‌యాల‌ త‌ర‌వాత కూడా ఓ ఫ్లాప్ వ‌స్తే… ` ఎందుకు ఆడ‌లేదు?` అనుకుంటే నాకంటే కక్కుర్తి ప‌డేవాడు ఉండ‌డు.

* ఈ సినిమాని గుండ‌మ్మ క‌థ‌తోనూ, రాజ్‌కుమార్ హీరాణీ సినిమాలతోనూ పోలుస్తున్నారు. మ‌రి మీ మాటేంటి?

– నాగ్, నానితో తీసిన సినిమా గుండ‌మ్మ క‌థ‌లా ఉండాలి అని అశ్వ‌నీద‌త్ ఫిక్స‌య్యారు. ఆయ‌న‌కు ఎప్పుడూ ఈ సినిమా గుండ‌మ్మ క‌థలానే క‌నిపిస్తుంది. అందులో త‌ప్పు లేదు. నాగ్ సార్ ఈ క‌థ‌ని రాజ్ కుమార్ హిరాణీ స్టైల్‌లో చూశారు. కాబ‌ట్టి ఆయ‌న‌కు అలా క‌నిపించి ఉంటుంది. ఈ సినిమాని ఓ జోన‌ర్‌కి ప‌రిమితం చేయ‌లేం. రాజ్‌కుమార్ హీరాణీ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. కానీ.. ఆయ‌న స్టైల్ ఆఫ్ సినిమాకాదు. క‌థ‌లో ఉన్న ప‌రిస్థితులు న‌వ్విస్తాయి త‌ప్ప‌… పాత్ర‌లు న‌వ్వించ‌వు. అక్క‌డున్న ప‌రిస్థితులు చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు హృద‌యానికి హ‌త్తుకునే స‌న్నివేశాలు ఉన్నాయి.

* జెర్సీలో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారా?

– రోజుకి మూడున్న‌ర గంట‌ల పాటు క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నా. ఈ విజ‌య ద‌శ‌మికి షూటింగ్ మొద‌ల‌వుతుంది. నా కెరీర్‌లో చాలా కీల‌క‌మైన సినిమా. వంద‌శాతం ఎఫెక్ట్ పెడుతున్నాం.

* చిన్నప్పుడు క్రికెట్ ఆడేవారా?

– స్కూల్లో ఆడేవాడ్ని. ప‌దో త‌ర‌గ‌తివ‌ర‌కూ ఆడాను. ఇప్పుడు మ‌ళ్లీ క్రికెట్ ఆడ‌తా. జెర్సీ నిర్మాత‌ల నుంచి వ‌చ్చిన మొద‌టి గిప్ట్ …క్రికెట్ కిట్టే. జెర్సీ సినిమా చేసేశాక‌ సీసీఎల్ లాంటివి జ‌రిగితే దుమ్ము దులిపేస్తా.

* బిగ్ బాస్ ముగింపుకి వ‌చ్చింది.. హ‌మ్మ‌య్య అయిపోయింది అనిపిస్తుందా, అప్పుడే అయిపోయిందా అనిపిస్తోందా?

– హ‌మ్మ‌య్య అయిపోయిందా అనే అనిపిస్తోంది. ఎందుకంటే మూడున్న‌ర నెల‌లు చాలా ఒత్తిడిగా గ‌డిచాయి. ఓ ప‌క్క సినిమాలు, మ‌రో ప‌క్క బిగ్ బాస్ షో. వారానికి ఒక్క రోజే క‌దా అని క‌మిట్ అయ్యా. కానీ షోని వారం రోజుల పాటు ఫాలో అవ్వాల్సివ‌స్తోంది. సంవ‌త్స‌రానికి మూడు సినిమాలు చేసినా.. షెడ్యూల్‌కి మ‌ధ్య‌లో క‌నీసం 10 రోజులు బ్రేక్ వ‌చ్చింది. కానీ మూడు నెల‌ల నుంచి.. ఒక్క పూట కూడా ఖాళీ లేను. బిగ్ బాస్ అయిపోయాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి.

* కౌశ‌ల్ ఆర్మీ మీపై మీ సినిమాల‌పై ప‌గ ప‌ట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది?

– అవ‌న్నీ మీరు న‌మ్ముతున్నారా? నేనైతే న‌మ్మ‌డం లేదు.

* బిగ్ బాస్ మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది?

– బిగ్ బాస్ చాలా మార్పు తీసుకొచ్చింది. ఇది వ‌ర‌కు అంద‌రూ మంచోళ్లే.. అంతా మంచోళ్లే అనుకునేవాడ్ని. కానీ ఆ అభిప్రాయాలు మారాయి. ఇంత కాంప్లెక్సా? ఇంత కాంప్లికేటెడా? ఇంత బ‌ల‌మైన నిర్ణ‌యాలా?? అని ఆశ్చ‌ర్య‌పోయా. ఈ షో నా కళ్లు తెరిపించింది. ప్ర‌పంచం నాకు ప‌రిచ‌య‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com