ఈ వేసవి మామూలుగా ఉండడం లేదు. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మార్చిలో అయితే.. నాని పారడైజ్, రామ్ చరణ్ పెద్ది, యశ్ ‘టాక్సిక్’ రాబోతున్నాయి. నాని – చరణ్ సినిమాలైతే ఒక రోజు వ్యవధిలో పలకరించబోతున్నాయి. మార్చి 26న వస్తున్నామని ‘పారడైజ్’ టీమ్ ముందే ప్రకటించింది. మార్చి 27న ‘పెద్ది’ ముస్తాబవుతోంది.
అయితే.. ఇప్పుడు ‘పారడైజ్’ విడుదల డైలామాలో పడింది. అనుకొన్నట్టుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని, కనీసం ఒక నెలైనా వాయిదా పడుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివర్లో గానీ, మే మొదటి వారంలో గానీ ఈ సినిమా వస్తుందని సమాచారం. ఫిబ్రవరిలో ‘పారడైజ్’ నుంచి ఓ గ్లింప్స్ రాబోతోంది. ఆ తరవాతి నుంచి ప్రమోషన్లు మొదలెడతారు.
‘పెద్ది’ సినిమా అనుకొన్నట్టుగానే మార్చి 27న వచ్చేస్తే.. ‘పారడైజ్’ వాయిదా పడుతుందని ముందు నుంచీ అనుకొంటూనే ఉన్నారు. చరణ్ ‘పెద్ది’కి లైన్ క్లియర్ చేయడానికే ‘పారడైజ్’ కాస్త ఆలస్యం అవుతోంది. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. సినిమాని హడావుడిగా వదలడం ఇష్టం లేక, దర్శకుడు కొంత సమయం అడిగాడని, అందుకే ‘పారడైజ్’ నెల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సివుంది.
