బిజినెస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ 2025 అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా గెల్చుకున్నారు. ఇండియాలో భారీ వ్యాపారసంస్థల్ని నడిపే మహిళలకు ఈ అవార్డు ఇస్తూంటారు. బిజినెస్ టుడే అవార్డుల్లో గుర్తింపు పొందడం గొప్ప గౌరవం. నాయకత్వం అంటే దీర్ఘకాలిక సంస్థలు నిర్మించడం, విలువలు సృష్టించడం అని నారా బ్రాహ్మణి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ అవార్డు పొందిన తర్వాత బ్రాహ్మణి పై సోషల్ మీడియాలో విస్తృత ప్రశంసలు వర్షం కురిసింది. బ్రాహ్మణి నాయకత్వ భావన ఎప్పుడూ నిశ్శబ్దంగా నిర్మించడం, దీర్ఘకాలిక ఆలోచన .. చేతల్లో ఫలితాలుచూపడంలోఉంటుందని నారా లోకేష్ ప్రశంసించారు. బిజినెస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్’లో గుర్తింపు పొందినందుకు చాలా గర్వంగా ఉందని నారా భువనేశ్వరి ప్రశంసించారు.
బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నాయకత్వం చేపట్టిన తర్వాత సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. 2011 నుంచి హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు బ్రాహ్మణి నారా చూస్తున్నారు. రెవిన్యూ 2011 1,000 కోట్ల నుంచి 2025లో రూ. 4,134 కోట్లకు చేరింది . ఆమె నాయకత్వంలో హెరిటేజ్ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల మార్కెట్ 40 శాతానికి పెరిగింది. హెరిటేజ్ లో ఇప్పుడు పాలతో పాటు కర్డ్, పనీర్, ఐస్‌క్రీమ్, మిల్క్ డ్రింక్స్ వంటివి మంచి మార్కెట్ వాటా సాధించాయి. దక్షిణ భారతం నుంచి మహారాష్ట్ర, ఈస్టర్న్ రీజియన్‌కు సంస్థను విస్తరించారు. బ్రాహ్మణి నాయకత్వం వల్ల హెరిటేజ్ ట్రెడిషనల్ డైరీ నుంచి మాడర్న్ FMCG బ్రాండ్‌గా మారి, సస్టైనబుల్ గ్రోత్ సాధించింది.
