ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ లో భాగంగా 19 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు , ఆర్జీయూకేటీ లో ఖాళీగా ఉన్న 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం అయింది. సామాజిక న్యాయం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టుల్లో 279 బ్యాక్లాగ్ వేకెన్సీలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా ప్రకటించారు.
పోస్టుల వివరాలు
మొత్తం భర్తీ చేయనున్న 1,523 పోస్టులలో 1,020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 63 ప్రొఫెసర్ , 104 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీల్లో మంజూరైన 4,343 పోస్టులకు గాను కేవలం 972 మంది మాత్రమే పని చేస్తుండటంతో, విద్యారంగంపై ఈ రిక్రూట్మెంట్ ఒక భారీ పెట్టుబడిగా మారనుంది. అత్యంత పారదర్శకమైన మెరిట్ విధానంలో, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారి అనుభవాన్ని బట్టి అదనపు వెయిటేజీ కల్పిస్తూ రక్షణ కల్పించింది.
విద్యా ప్రమాణాల మెరుగుదల:
ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా ప్రమాణాలు పెరగడమే కాకుండా, పరిశోధనలు, ఆవిష్కరణలు , నాక్,ఎ న్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మన యూనివర్సిటీలు అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. భావి తరాన్ని తీర్చిదిద్దే ఈ బాధ్యతాయుతమైన ఉద్యోగాలకు అభ్యర్థులు అంకితభావంతో సిద్ధం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అర్హులైన అభ్యర్థులు మే 18, 2026 నుంచి అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
సకాలంలో జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ విద్యావంతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. నిర్ణీత గడువులోగా పూర్తి పారదర్శకతతో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వేసిన ఈ అడుగు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించనుంది.
