ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు ఏపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఎంపీలతో సమావేశమైన లోకేష్.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రకటించిన రాయితీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
బుధవారం ఉదయం నుంచి లోకేష్ వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఏఐ కరికులమ్ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో రోబోటిక్స్ ల్యాబ్ల ఏర్పాటు , విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరనున్నారు. అలాగే, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలపై కూడా ఆయన మంత్రులతో మాట్లాడనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, నిధుల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి తరచూ ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్లి కీలక నేతల్ని కలుస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో సహా కొందరు నేతల్ని కలిశారు. ఇప్పుడు లోకేష్ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ ఢిల్లీకి వెళ్లి ఏపీకి రావాల్సిన నిధులపై ఫాలో అప్ చేసుకుంటున్నారు.