నారా లోకేష్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటోంది. ఆయన పర్యటనల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. అలుపెరుగని పర్యటనలతో రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులు, పెట్టుబడుల కోసం తీరిక లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా పర్యటనలు ముగించుకుని వచ్చిన వెంటనే విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ విశాఖకు వెళ్లనున్నారు. ఇలా ఆయన షెడ్యూల్ ఊపిరి సలపనంతగా ఉంటోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపుతున్న చొరవ, సమర్థవంతమైన నాయకత్వం ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
సోమవారం ఢిల్లీకి నారా లోకేష్
సోమవారం ఢిల్లీకి బయలుదేరనున్న నారా లోకేష్, అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. విద్య, ఐటీ సంబంధిత అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇటీవల అమెరికా, కెనడాలోని ప్రముఖ సంస్థలు, నిపుణులతో సమావేశాలు జరిపిన లోకేష్, ఆ అనుభవాలను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించారు. కొన్ని పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తప్పనిసరి కావడంతో.. ఢిల్లీ వెల్తున్నారు.
మంగళవారం విశాఖలో GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవం
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, ఈ నెల 16న విశాఖపట్నం చేరుకుని GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖలో ఏవియేషన్ విద్యా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి, ఇది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఇటీవల విశాఖలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్, మళ్లీ మూడు రోజుల వ్యవధిలోనే నగరానికి వెళ్తున్నారు. విశాఖలో ఇక నుంచి తరచూ.. పెట్టుబడులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఆయన హాజరు కావాల్సి రావొచ్చు. ఆ ట్రెండ్ ఇప్పుడే కనిపిస్తోంది.
అలసట లేకుండా లోకేష్ పని తీరు
చంద్రబాబునాయుడు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసేవారు. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన పనితీరు ఎలా ఉండేదో.. నారా లోకేష్ మంత్రిగానే ఆ స్థాయిలో పని చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఫాలో అప్ చేసుకుంటున్నారు. ఆయన అలుపెరుగని పర్యటనలు, వివిధ రంగాల్లో చేస్తున్న కృషి ప్రజల్లోనూ చర్చకు కారణం అవుతోంది. ఇంత బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎవరికైనా సాయం కావాలంటే స్పందిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపైనా ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఈ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
