వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలను హైలెట్ చేస్తూ నారా లోకేష్ .. వారికి టీం 11 అని పేరు పెట్టారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లి చంద్రబాబు, లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల బృందం .. ఇరవై దేశాలనుంచి వచ్చిన తెలుగు డయాస్పోరాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో వైసీపీపై నారా లోకేష్ సెటైరిక్ విమర్శలు చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీం-11 తీరును ఖండించారు. ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈ-మెయిల్స్ పంపే స్థాయికి వారు దిగజారారని.. టీం-11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని లోకేష్ సెటైర్ వేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల క్రెడిట్ ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీం 11 తీరుపైనా మండిపడ్డారు. కేవలం బాబాయ్ హత్య, తల్లి-చెల్లిని గెంటేయడం వంటి నెగటివ్ క్రెడిట్లే వారి ఖాతాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు, తమ కేబినెట్ లో యువ మంత్రులంతా మిస్సైల్స్ లాంటి వారని, తమకు చంద్రబాబు నాయుడు జీపీఎస్ లాగా దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు.
ప్రవాస తెలుగు వారంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే .. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి సాధించామన్నారు. రూ. 23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రసంగించారు. తెలుగు ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. ఈ సమావేశం పూర్తిగా పార్టీ పరంగా జరిగింది. దీంతో ఇరవై దేశాల నుంచి తెలుగు దేశం పార్టీ అభిమానులు తరలి వచ్చారు.


