తన పై మార్ఫింగ్ ట్వీట్, ‘వైకాపా పేటీఎం బ్యాచ్’ పనే అంటూ విరుచుకుపడ్డ లోకేష్

నారా లోకేష్ మీద వచ్చినన్ని మార్ఫింగ్ ట్వీట్ లు ఈ మధ్యకాలంలో మరెవరి మీద వచ్చి ఉండవేమో. నారా లోకేష్ ని ఒక తెలివితక్కువ వ్యక్తిగా చిత్రీకరించడానికి ఆయన అకౌంట్ ని పోలిన విధంగా నకిలీ అకౌంట్ సృష్టించి, తాను ట్వీట్ చేసినట్టుగా కొన్ని అసంబద్ధమైన ట్వీట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా లోకేష్ ను పూర్తిగా రాజకీయాలకు పనికి రాకుండా చేయాలని ఒక వ్యూహం ప్రకారం ఈ ప్రచారం సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే తాజాగా తన పేరు మీద చేసిన ఇలాంటి ఒక ఫేక్ ట్విట్ మీద విరుచుకుపడ్డారు నారా లోకేష్.

నిన్న ఎయిడ్స్ డే సందర్భంగా, లోకేష్ ట్వీట్ చేసినట్లుగా ఒక ఫేక్ ట్వీట్ కొందరు పనిగట్టుకుని సృష్టించారు. ” ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న నా సోదర సోదరీమణులకు ఎయిడ్స్ డే శుభాకాంక్షలు. మీకు తెలుగు దేశం అండగా ఉంటుంది” అని రాసిన ఆ ట్వీట్ ను నారా లోకేష్ అకౌంట్ ని పోలిన నకిలీ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. అయితే ఇది నకిలీ అకౌంట్ అని తెలియని పలువురు, ‘ఎయిడ్స్ డే కి శుభాకాంక్షలు చెబుతున్నానంటే నువ్వు నిజంగా పప్పు’, ‘ఎయిడ్స్ డే కి ఎవరైనా శుభాకాంక్షలు చెబుతారా తింగరి వాడి లాగా ఉన్నావు’ – ఇలా స్పందించారు.

అయితే ఇలా ఒక పథకం ప్రకారం, తన మీద జరుగుతున్న కుటిల యత్నాలను ట్విట్టర్ వేదికగా ఖండించారు లోకేష్. ఆయన ట్వీట్ చేస్తూ, “ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్. జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు. నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు ” అని రాసుకొచ్చారు.

మరి లోకేష్ పేర్కొన్న ఆ పేటీఎం బ్యాచ్ లోకేష్ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com