ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి లోకేశ్‌ను ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్’ (SVP)లో పాల్గొనమని ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ ప్రోగ్రామ్ ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నాయకులు, విద్యా నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశాలకు అవకాశం కల్పిస్తుంది.
ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, ఆర్థిక వృద్ధి రంగాల్లో జరుగుతున్న సంస్కరణలను ఆహ్వాన లేఖలో ప్రశంసించారు. ముఖ్యంగా, మంత్రి లోకేశ్ చేపట్టిన విద్యా రంగ సంస్కరణలు, ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ ప్రారంభం అద్భుతమైన విషయమన్నారు. ఈ సంస్కరణలు రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తయారు చేస్తున్నాయని, ఇది ఆస్ట్రేలియాతో భవిష్యత్ సహకారాలకు మార్గం సుగమం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం అవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాధాన్యతలు, విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక సదుపాయాలు – పై ఆస్ట్రేలియాతో చర్చలు జరిపే అవకాశం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లలో భారతదేశానికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2001లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా SVPలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించారు.