ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా తనతో డిన్నర్ సమావేశానికి రావాలని ఆహ్వానించేవారు అతి తక్కువ మంది ఉంటారు. కుటుంబసభ్యులుగా భావించేవారిని మాత్రమే ప్రధాని మోదీ అలా పిలుస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్ తో పాటు కుటుంబాన్ని పిలిచి కుటుంబసభ్యుల్లా తన ఇంట్లో ఆతిధ్యం ఇచ్చారు. ఆయన లోకేష్ ను తన కుటుంబసభ్యుడిగా చూసుకుంటున్నారన్న భావన వ్యక్తమవుతోంది.
నారా లోకేష్ వారసుడని గతంలో మోదీ విమర్శలు
నారా లోకేష్ ను ఒకప్పుడు ప్రధాని మోదీ వ్యతిరేకించేవారు. చంద్రబాబు తన కుమారుడి వారసుడిగా రుద్దుతున్నారని అనుకునేవారు. అందుకే గతంలో ఎన్డీఏలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రోత్సాహం ఇవ్వలేదు.చంద్రబాబు 2018లో ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు తన కుమారుడి వికాసం కోసం పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఒకసారి కాదు.. ఎన్నికలు అయిపోయే వరకూ ఈ విమర్శలు సాగాయి.
తనను తాను నిరూపించుకున్న లోకేష్‌పై మోదీకి అభిమానం
అప్పటికి నారా లోకేష్ తనను తాను నిరూపించుకోలేదు. ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వారసత్వానికి మొదటి అవకాశాలు వస్తాయేమో కానీ సర్వైవ్ కావాలంటే సామర్థ్యం ముఖ్యం. అంతే కాదు ఒక్కో సారి ఆ వారసత్వం మోయడం బరువే అవుతుంది. ఆ ప్రకారం చూస్తే నారా లోకేష్ కు మొదటే అగ్నిపరీక్ష ఎదురయింది. అత్యంత కఠిన పరిస్థితుల్లో ఆయన తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. విజయం సాధించారు. నారా లోకేష్ లో పట్టుదల రాజకీయాలు ఎలా చేయాలన్నదానిపై ఉన్న స్పష్టమైన విజన్ ప్రధాని మోదీని ఆకట్టుకుందని చెబుతారు.
దేశ భావి అగ్రనేతల్లో ఒకరుగా ఉండే చాన్స్
అదే సమయంలో భారత దేశ యువనాయకత్వంలో నారా లోకేష్ అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉంటారని మోదీ అంచనాగా భావిస్తున్నారు. ఏ రంగంలో అయినా కొత్త తరం రావాల్సిందే. ఇప్పుడే నలభైల్లోకి వచ్చిన నారా లోకేష్.. దేశ రాజకీయాలలో కీలకమైన నేతగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి యువనాయకుల్ని..దేశం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తారని భావించే నేతలపై ప్రధాని మోదీ ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారని అంటున్నారు. నారా లోకేష్.. తనపై అలాంటి అభిప్రాయాన్ని మోదీకి కల్పించారని అనుకోవచ్చు.