దిగ్గజ సంస్థలు ఎవైనా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాయని తెలిసిన వెంటనే నారా లోకేష్ రంగంలోకి దిగిపోతున్నారు. తాజాగా ప్రపంచ నెంబర్ వన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ఇండియాలో పెట్టుబడుల అంశాలను పరిశీలించడానికి ఇండియాకు వచ్చింది. ఆ కంపెనీ చైర్మన్ సహా బోర్డు సభ్యులంతా వచ్చారు. ఈ విషయం తెలుసకున్న నారా లోకేష్ వెంటనే ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి వారి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్ తో పాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అందరికీ ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివరించారు.
ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్ లలో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రణాళికలకు సరిపోతాయన్నారు. పెట్టుబడిదారుల ప్రాధాన్య విధానాన్ని, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్ధిష్ట గడువులోగా ప్రాజెక్ట్ అమలు వంటి అంశాల ను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఎయిర్ బస్ వస్తుందో రాదో కానీ.. వారి దృష్టిలో మాత్రం ఏపీ రిజిస్టర్ అయి ఉంటుంది. ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించినప్పుడు అనుకూలంగా ఉంటే.. ఏపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.